
- నేషనల్హైవేస్అధికారులపై వాటర్‌బోర్డు ఎండీ అసహనం
- సోమవారం కూడా పనులు కొనసాగే అవకాశం
- ఆ 20 ప్రాంతాలకు నేడు కూడా నీటి సరఫరా లేనట్టే
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రోడ్డు పనుల్లో భాగంగా తాగునీటి పైప్ లైన్‌ను మరో చోటికి మార్చే పనులను నేషనల్హైవే అథారిటీ ఆఫ్ఇండియా ఆలస్యం చేస్తుండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో 30 గంటలుగా నీటి సరఫరా బందయ్యింది. దీంతో ఎన్హెచ్ఏఐపై వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద రోడ్డు పనుల కోసం వాటర్‌బోర్డుకు చెందిన పీఎస్సీ పైప్ లైన్‌ను వేరే చోటకు మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పనుల బాధ్యతను ఎన్‌హెచ్ఏఐ తీసుకుంది.12 గంటల్లో పనులు పూర్తి చేస్తామని వాటర్‌బోర్డు అధికారులకు చెప్పడంతో 8వ తేదీ(శనివారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓఅండ్ఎం డివిజన్లు 6, 9, 17, 22లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, కొన్ని చోట్ల లో- ప్రెషర్‌తో వాటర్వస్తుందని ప్రకటించింది.
అయితే, 30 గంటలు గడిచినా పనులు పూర్తి చేయకపోవడంతో ఇంకా ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఆదివారం పరిస్థితిపై సమీక్షించారు. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేయాలని ఎన్‌హెచ్ఏఐని కోరారు. పనుల ఆలస్యం వల్ల నీటి సరఫరా పూర్తిగా పునరుద్ధరించి, సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు మరో వారం రోజులు పట్టవచ్చని, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
నీటి సరఫరా ఉండని ప్రాంతాలివే...
ఎన్‌హెచ్ఏఐ అధికారులు పనులు ఆలస్యం చేస్తుండడంతో ఆదివారం నీటి సరఫరా నిలిచిపోగా, సోమవారం కూడా పనులు కొనసాగే అవకాశం ఉండడంతో ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట,ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, దీప్తి శ్రీ నగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేటకు నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.