వేసవిలో మినీ ట్యాంకర్లతోనూ నీటి సరఫరా.. 70 కొత్త వాటర్​ ట్యాంకర్లకు బోర్డు ఆర్డర్

వేసవిలో మినీ ట్యాంకర్లతోనూ నీటి సరఫరా.. 70 కొత్త వాటర్​ ట్యాంకర్లకు బోర్డు ఆర్డర్
  • డివిజన్​కు ఎన్ని ట్యాంకర్లు అవసరమవుతాయో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు 
  • తక్కువ సమయంలో ఎక్కువ ట్యాంకర్లు సరఫరా చేసేలా ప్లాన్
  • రద్దీ, ఇరుకు గల్లీల్లోకి వెళ్లలేకపోతున్న పెద్ద ట్యాంకర్లు


​హైదరాబాద్​సిటీ, వెలుగు:గ్రేటర్​లో వేసవి రాకముందే పెద్ద సంఖ్యలో వాటర్​ట్యాంకర్లను బుక్​చేసుకుంటున్నారు. ఎండలు తీవ్రమైతే బుకింగ్స్​మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మెట్రో వాటర్​బోర్డు అధికారులు అలర్ట్​అయ్యారు. గతేడాది చాలా ప్రాంతాల్లో భూగర్భజలాలు తగ్గిపోవడంతో వాటర్​ట్యాంకర్లకు డిమాండ్​ఏర్పడింది. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇప్పుడున్న నీటి ట్యాంకర్లు ట్రాఫిక్​ రద్దీలో ఇరుక్కుపోవడం, రాత్రి సమయాల్లో బస్తీలు, కాలనీల్లో ఇండ్ల ముందే కార్లు, టూ వీలర్ల వంటివి పార్క్​ చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోకి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో మినీ వాటర్​ట్యాంకర్లు నడిపించాలని బోర్డు నిర్ణయించుకుంది. 

2,500 లీటర్ల ట్యాంకర్లు

బోర్డు వద్ద 725 ట్యాంకర్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో కొన్ని బోర్డు సొంతవి కాగా, మరికొన్ని అద్దెకు తీసుకున్నవి ఉన్నాయి. వీటితో 5 వేలు,10 వేల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. గత ఏడాది ఈ ట్యాంకర్లను ఆర్టీఏతో పాటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్నారు. ఇందులో కొన్ని ట్యాంకర్లను తగ్గించి మినీ ట్యాంకర్లను ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. 

ఈ మినీ ట్యాంకర్లతో 2,500 లీటర్లను సరఫరా చేయొచ్చు. గత ఏడాది 2,500 లీటర్ల సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లకు ఆర్డర్​ఇచ్చినా అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఈసారి మాత్రం ముందు చూపుతో వాటిని తెస్తామని చెప్తున్నారు. అలాగే కొన్ని మినీ ట్యాంకర్లను ఏర్పాటు చేసుకోవాలని అద్దె ట్యాంకర్ల నిర్వాహకులకు సూచించారు. 

లేకపోతే రేటు డబుల్

వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో డివిజన్​కు ఎన్ని ట్యాంకర్లు అవసరమవుతాయో నివేదిక ఇవ్వాలని డివిజన్ల జీఎంలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి 50 నుంచి 100 ఎంజీడీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. గత వేసవిలో40 వేల కుటుంబాలు 70 శాతం ట్యాంకర్లు బుక్​చేసుకోగా, ఇందులో 18 వేల కుటుంబాలకు మాత్రమే ఇంకుడు గుంతలున్నట్టు గుర్తించారు. 14వేల ఇండ్లకు నోటీసులిచ్చిన అధికారులు  ఇంకుడు గుంతలు నిర్మించుకోకుంటే ట్యాంకర్ రేట్లు రెట్టింపు వసూలు చేయాలని నిర్ణయించారు.