- ఖమ్మం జిల్లాలో వారం పాటు ఇవ్వలేమన్న అధికారులు
- పాలేరు రిజర్వాయర్ ఇన్టేక్ వెల్లో పూడికతీత పనులు
ఖమ్మం, వెలుగు: ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవకపోవడంతో గ్రామాల్లో తాగునీటి సరఫరా పైన ఎఫెక్ట్ పడింది. పాలేరు రిజర్వాయర్ లో నీటిమట్టం అడుగంటడంతో 74 గ్రామాల్లో సోమవారం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోనుంది. మిషన్ భగీరథకు నీళ్లు సప్లై చేసే ఇన్టేక్ వెల్ దగ్గర పూడికతీత పనులు చేపడుతున్నందున వారం రోజులపాటు 74 గ్రామాల్లో మంచినీటి సరఫరా ఉండదని మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు ప్రకటించారు.
గ్రామాల్లో మంచినీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సర్పంచులకు, అధికారులు సూచించారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల పాలేరు రిజర్వాయర్ లో నీటిమట్టం పూర్తిగా పడిపోయంది. మరోవైపు తాగునీటి సరఫరా కోసమైనా నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశామని నీటిపారుదల శాఖ సీఈ శంకర్ నాయక్ చెప్పారు. అయితే, కాలువల రిపేర్ల పనులు కొనసాగుతున్నందున, ప్రస్తుతం నీటి విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వారం రోజులపాటు తాగునీటి సరఫరా బంద్ అని అధికారులు చెబుతుండడంతో గ్రామాల్లో ప్రైవేటు బోర్లనుంచి నీటి సప్లై చేసేందుకు సర్పంచులు ఏర్పాట్లు చేస్తున్నారు.