హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చేపట్టిన మరమ్మతు పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లో మిరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ప్రాంతం వద్ద నున్న 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు.
చాంద్రాయణగుట్టలోని సన్నీ గార్డెన్ నుంచి షోయబ్ హోటల్ వరకు బాక్స్ డ్రైయిన్ పనులకు ఇబ్బందుల్లేకుండా ఈ జంక్షన్ పనులు చేస్తున్నారు. దీంతో జనవరి 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జనవరి 21వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్‌లోని మిస్త్రీగంజ్, బహదూర్ పురా, కిషన్ బాగ్, జహానుమా, మొఘల్ పురా, దారుల్ షిఫా, సుల్తాన్ షాహి, పత్తర్ ఘట్టి, అల్ జుబైల్ కాలనీ, అలియాబాద్, గౌలిపురా, తలాబ్ కట్ట, రియాసత్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది, ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటం జనవరి నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. జనవరి 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోవడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని నివాసితులు ఇబ్బందులు పడ్డారు.