హైదరాబాద్ లో ఈ 10 ఏరియాల్లో నీళ్ల ట్యాంకర్లకు ఫుల్​ డిమాండ్.. సమ్మర్లో చుక్కలే.. !

హైదరాబాద్ లో ఈ 10 ఏరియాల్లో నీళ్ల ట్యాంకర్లకు ఫుల్​ డిమాండ్..  సమ్మర్లో చుక్కలే.. !
  • నిరుటితో పోలిస్తే ఈ మార్చి నాటికే  50 శాతం బుకింగ్స్​ పెరుగుదల
  • రోజుకు 12 వేల నుంచి 14 వేల ట్యాంకర్ల బుకింగ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో  నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్​ పెరిగింది. నల్లాల ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లు బుక్​ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఈ సంఖ్య ప్రతిరోజూ వేలల్లో ఉంటున్నది. ముఖ్యంగా వెస్ట్​సిటీ వైపు అంటే.. కూకట్​​పల్లి, శేరిలింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, ఐటీ కారిడార్, కోకాపేట, బోరబండ, ఎస్సార్​​నగర్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో నిరుటి మాదిరిగానే ఈ సారి కూడా ఫిబ్రవరి నాటికే భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో జనాలు మెట్రోవాటర్​బోర్డు వాటర్​ట్యాంకర్లను బుక్​ చేసుకుంటున్నారు. 

టౌన్​షిప్​లు, గేటెడ్​కమ్యూనిటీలు, అపార్ట్​మెంట్లలో ఉండేవారైతే పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. హైరైజ్​ భవనాలుండే సమీప ప్రాంతాల కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ట్యాంకర్లు బుక్​ అవుతున్నాయి. దీంతో వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ట్యాంకర్లు క్యూ కట్టాల్సి వస్తున్నది. నిరుడిలాగే వెస్ట్​సిటీలోని ప్రాంతాల నుంచే ట్యాంకర్లకు ఎక్కువ డిమాండ్​పెరిగిందని వాటర్​బోర్డు అధికారులు చెబుతున్నారు. 

2023–24 సంవత్సరం 28 నుంచి 32 శాతం డిమాండ్​ పెరగ్గా, 2024–25 ఫిబ్రవరి నాటికి ఇది 40 నుంచి 42 శాతానికి చేరింది. ఇది రాను రాను మరింత ఎక్కువయ్యే అవకాశముందని అంటున్నారు. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్​ను తట్టుకునేందుకు మెట్రోవాటర్​బోర్డు అధికారులు పెద్ద సంఖ్యలో ఫిల్లింగ్​పాయింట్లను పెంచినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఆయా పాయింట్ల వద్ద ట్యాంకర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది.  

గతేడాది పరిస్థితులే పునరావృతం 

నిరుడు వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రేటర్​పరిధిలో నీటికి తీవ్ర కటకట ఏర్పడింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నది. ట్యాంకర్ల డిమాండ్​విషయానికి వస్తే గతేడాది ఫిబ్రవరి నెలలో1,12,926 ట్యాంకర్లను మెట్రోవాటర్​బోర్డు అధికారులు సరఫరా చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో లక్షా 50 వేల ట్యాంకర్లు సరఫరా చేశారు. గత ఏడాది మార్చిలో 1,69,452 ట్యాంకర్లను సరఫరా చేయగా, ఈ సంవత్సరం ఇప్పటికే 50 వేల ట్యాంకర్లు బుక్​ అయినట్టు అధికారులు తెలిపారు. 

గత ఏడాది ఏప్రిల్ నెలలో 2,37,596, మేలో 2,27,390 ట్యాంకర్లను సరఫరా చేశారు. ఈ సారి డిమాండ్​ఎక్కువగా ఉండడంతో ఈ నెల 3 రోజుల్లోనే 50 వేల వరకు ట్యాంకర్లను సరఫరా చేశామని తెలిపారు. ఈ నెల అంతా కలిపి ఇది 1.80 లక్షల ట్యాంకర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. వచ్చే నెల రెండున్నర లక్షల ట్యాంకర్లు బుక్​ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

త్వరలో 24 గంటల సరఫరా 

ఒక పక్క ట్యాంకర్ల బుకింగ్​లు పెరుగుతుంటే..  ఫిల్లింగ్ స్టేషన్లలో ఆ స్థాయిలో వాటిని నింపే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ఒక్కో ట్యాంకర్​నీటిని నింపుకొని బయటకు వచ్చే సరికి అరగంట నుంచి 45 నిమిషాలు, కొన్ని సార్లు గంట కూడా పడుతున్నదని సిబ్బంది చెబుతున్నారు. దీంతో  సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో రాత్రిళ్లు కూడా ట్యాంకర్లు  సరఫరా చేయాలని, డిమాండ్​మరింత పెరిగితే 24 గంటల పాటు సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు.  

నీటి సమస్యకు కారణాలపై సర్వే

వెస్ట్​సిటీలోని కొన్ని ప్రాంతాల నుంచే భారీ సంఖ్యలో ట్యాంకర్లు బుక్​ కావడంపై వాటర్​బోర్డు అధికారులు ఆరా తీశారు. ముఖ్యంగా కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్​, ఐటీ కారిడార్​, కొండాపూర్​, చందానగర్​, మియా పూర్​తదితర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో హైరైజ్​భవనాలు, అపార్ట్​మెంట్లు, గేటెడ్​కమ్యూనిటీలు అధికంగా ఉండడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటినట్టు గుర్తించారు. 

ఇతర ప్రాంతాల్లో అత్యధికంగా వెయ్యి అడుగుల మేరకు బోర్లు వేయగా, ఈ  ప్రాంతాల్లో  2 వేల ఫీట్లు వేసినా నీళ్లు రావడం లేదని చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతాల నుంచే గత ఏడాది రోజుకు 80 వేల ట్యాంకర్లు బుక్​అయినట్టు గుర్తించారు. ఈ సారి కూడా అవే ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో బుకింగ్స్​వస్తున్నాయని అధికారులు తెలిపారు. వెస్ట్​సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు ఎక్కువగా లేవని గుర్తించారు. 

దీంతో ఇప్పటి వరకూ 40 వేల మందికి నోటీసులు జారీ చేసినట్టు మెట్రోవాటర్​బోర్డు రెయిన్​వాటర్​హార్వెస్టింగ్​ విభాగం ఆఫీసర్లు తెలిపారు. వారు ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా కౌన్సెలింగ్​ఇచ్చామని, చాలా మంది వాటిని నిర్మించుకుంటున్నారని చెప్పారు. దీని ఫలితాలు వచ్చే వర్షాకాలం తర్వాత తెలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోని వారి నుంచి ట్యాంకర్​చార్జీలు రెట్టింపు వసూలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ప్రైవేట్​ ట్యాంకర్ల దోపిడీ 

 మెట్రో వాటర్​ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యమవుతుండ డంతో కొందరు ప్రైవేట్​ ట్యాంకర్ల నిర్వాహకులు పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. మెట్రో వాటర్​ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు  (5వేల లీటర్లు) రూ. 500, కమర్షియల్​ అయితే (5 వేల లీటర్లు) రూ. 850 వసూలు చేస్తున్నది. అదే  ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు మాత్రం ఒక్కో ట్యాంకర్​కు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నారు. 

శివారు ప్రాంతాల్లో  ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ పెరిగింది. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమంగా బోర్లు వేసి నీళ్లను తోడుతున్నారు. వారు కూడా రోజుకు 1500 నుంచి 2 వేల ట్యాంకర్లను అమ్ముకుంటున్నట్టు సమాచారం. 


మూడేండ్లలో వాటర్​బోర్డు ట్యాంకర్ల సరఫరా  ఇలా..

సంవత్సరం    ఫిబ్రవరి    మార్చి    ఏప్రిల్    మే
2022-23          86,497    1,12,594    1,60,000    1,40,000
2023-24        1,12,926    1,69,452    2,37,576    2,27,390
2024-25        1,50,000    –    –    –