డిసెంబర్ 25 నుంచి కోయిల్  సాగర్ ఆయకట్టుకు నీరు

డిసెంబర్ 25 నుంచి కోయిల్  సాగర్ ఆయకట్టుకు నీరు

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న పంట పొలాలకు ఈ నెల  25 నుంచి  వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.  శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన సాగు నీటి సలహా మండలి సమావేశం జరిగింది.  సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి, సాగునీటి శాఖ, వ్యవసాయశాఖ, మిషన్ భగీరథ శాఖల అధికారులు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.  యాసంగి 2024–-25 సీజన్ కు  కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీరు విడుదలకు సాగునీటి సలహా మండలి సభ్యులు, రైతులతో చర్చించి పలు తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..  డిసెంబర్ 25 నుంచి  ఏప్రిల్ 15 వరకు నీటి విడుదలకు సాగునీటి సలహా మండలి నిర్ణయం తీసుకుందన్నారు.  డిస్ట్రిబ్యూటరీ కాల్వలలో పూడిక తీయాలని ఎమ్మెల్యే సూచించారు. పెండింగ్ పనుల పై చర్చించి కాల్వల నుంచి మోటార్ల  ద్వారా అక్రమంగా నీటిని  వాడుకునే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశం లో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు సాగునీటి ప్రాజెక్టు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.