కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం హెడ్ రెగ్యులేటర్ నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ కు మంత్రి,ప్రణాళిక బోర్డు వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ జీవి రామకృష్ణ రావు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మానేరు నుంచి 9 లక్షల ఎకరాల సాగుకు అవసరమైన నీటిని కిందకు విడుదల చేశామన్నారు. రైతుల నుంచి డిమాండ్ ఉన్నందున కాకతీయ కాలువ ద్వారా ప్రస్తుతం 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.
ఈ నీరు వరంగల్ నుంచి సూర్యాపేట వరకు తరలనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాక ముందు ఇదే మానేరు నుంచి నీటి విడుదలను ఆపేయాలని తానే స్వయంగా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు తన చేతుల్తోనే కిందకి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు.
గతంలో సాగునీటి కోసం కొట్లాటలు జరిగాయని అన్నారు. చివరి ఆయకట్టుకు సైతం నీటిని అందించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.