హైదరాబాద్లో నాలుగు చోట్ల వాటర్​బోర్డు సోలార్​ ప్లాంట్లు.. 290 ఎకరాల్లో ఏర్పాటు

హైదరాబాద్లో నాలుగు చోట్ల వాటర్​బోర్డు సోలార్​ ప్లాంట్లు.. 290 ఎకరాల్లో ఏర్పాటు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: మెట్రోవాటర్​బోర్డుకు చెందిన స్థలాల్లో సొంతంగా ‘సోలార్​ ఎనర్జీ’ ని ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. మొదటి దశలో వాటర్​బోర్డుకు చెందిన నాలుగు ప్రాంతాల్లోని 290 ఎకరాల్లో గ్రౌండ్​మౌంటెడ్​సోలార్​పవర్​ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు తెలంగాణ రెన్యువబుల్​ఎనర్జీ డెవలప్​మెంట్​కార్పొరేషన్​( టి రెడ్కో)తో కలిసి వాటర్​బోర్డు యాక్షన్​ప్లాన్​ సిద్ధం చేసింది. 

బోర్డుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, రిజర్వాయర్ల ప్రాంగణాలు, ఎస్టీపీల ప్రాంగణాలు, డిస్ట్రిబ్యూషన్​సెంటర్లతో పాటు గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల ప్రాంతాల్లో ఖాళీ భూములున్నాయి. వీటిలో సోలార్​ప్లాంట్లను ఏర్పాటుచేసి కరెంట్​ఉత్పత్తి చేసుకోవాలని ఇదివరకే నిర్ణయించింది. సంవత్సరం పొడవునా సోలార్​పవర్​తో బోర్డు విద్యుత్​ అవసరాలు కొంతవరకైనా తీరతాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ప్లాంట్లకు సంబంధించి పనులను చేయడానికి అర్హత గల ఏజెన్సీల నుంచి తెలంగాణ రెడ్కో టెండర్లను ఆహ్వానించింది. సదరు ఏజెన్సీలు ఆయా ప్రాంతాల్లో సర్వే చేసి డీపీఆర్​తయారు చేస్తాయి. 

అందుకే... సొంతంగా .. 

ప్రస్తుతం వాటర్​బోర్డు..కృష్ణా మూడు దశల్లోనూ, గోదావరి ప్రాజెక్టు, సింగూరు, మంజీరా వంటి జలాశయాల నుంచి నగరానికి నీటిని పంపింగ్​ద్వారా తీసుకువస్తోంది. వాటర్​ట్రీట్​మెంట్​ప్లాంట్లు, సీవరేజీ ట్రీట్​మెంట్​ప్లాంట్లు, నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూషన్​కోసం పెద్దమొత్తంలో విద్యుత్​ వినియోగిస్తోంది. రాబోయే రోజుల్లో మరికొన్ని కీలక ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి. దీంతో విద్యుత్​ వినియోగం గణనీయంగా పెరగబోతోంది. ఈ నేపథ్యంలో సొంతంగా సోలార్​ప్లాంట్ల ద్వారా విద్యుత్​ఉత్పత్తి చేయడానికి వాటర్​బోర్డు...రెడ్కోతో కలిసి పని చేస్తోంది. 

ఆ నాలుగు చోట్ల.. 

సోలార్​ ప్లాంట్లను వాటర్​బోర్డుకు సంబంధించి ఖాళీ స్థలాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. బోర్డుకు గోదావరి ప్రాజెక్టుకు చెందిన ముర్మూర్​పంప్​హౌస్​, పెద్దపల్లిలో బోర్డు సబ్​స్టేషన్​లో 60 ఎకరాలు, మల్లారం పంప్​హౌస్​ఉన్న సిద్ధిపేటలోని చిన్న కోడూరు వద్ద 80 ఎకరాలు, కొండపాక సబ్​స్టేషన్​వద్ద 100 ఎకరాలు, మెదక్​జిల్లాలోని పటాన్​చెరు సమీపంలోని పెద్దాపూర్​సబ్​స్టేషన్​వద్ద 50 ఎకరాలు ఉన్నాయి. ఈ స్థలాల్లో మొదటిదశలో గ్రౌండ్​మౌంటెడ్​సోలార్​పవర్​ప్లాంట్​నిర్మించేందుకు వాటర్​బోర్డు ప్రణాళికలు రూపొందించింది. ఈ పనులను రెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ ప్లాంట్​ద్వారా 80 మెగావాట్ల విద్యుత్​ఉత్పత్తి చేయనున్నారు.