ముంబైలో భారీ వర్షాలు.. రహదార్లు జలమయం

ముంబైలో భారీ వర్షాలు..  రహదార్లు జలమయం

మహారాష్ట్ర: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల పురోగతితో జూన్ 5వ తేదీ బుధవారం తెల్లవారుజాము నుంచే నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిస్తోంది.  థానే, నవీ ముంబై సహా ముంబై శివారు ప్రాంతాలు, పరిసర ప్రాంతాలలో వర్షం కురిసింది. సెంట్రల్ లైన్ థానే నుండి దాదర్ సమీపంలోని పలు ప్రాంతాల్లోనూ  మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 

నగరంలోని దాదర్, కండివాలి, మగథానే, ఓషివారా, వాడాలా, ఘట్‌కోపర్ వంటి అనేక ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి  8 గంటల మధ్య 4 ఎంఎం నుండి 26 ఎంఎం వరకు జల్లులు కురిశాయని పౌర అధికారి తెలిపారు. సెంట్రల్, దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది.  దీంతో లోతట్టు ప్రాంతాలు  జలమయం అయ్యాయి. 

రోడ్లు, కాలనీలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.  దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు సిబ్బంది. కాగా రానున్న 24 గంటల్లో ముంబై నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.