జీవో 111 ఎత్తివేతపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఆందోళన

  • ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు
  • ఆ 84 గ్రామాలు కాంక్రీట్ జంగిల్‌‌‌‌గా మారబోతున్నయ్‌‌‌‌
  • రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్  వేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జీవో 111 ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విపత్తుకు దారి తీస్తుందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ వరల్డ్ వాటర్ కమిషన్ ఆన్ డ్రాట్ అండ్ ఫ్లడ్ చైర్మన్ రాజేంద్ర సింగ్ అన్నారు. హిమాయత్ సాగర్, గండిపేట రిజర్వాయర్లకు నీటిని అందించే ఏడు మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో పర్యావరణ పరిరక్షణకు 1996లో తెచ్చిన జీవో 111 ఎత్తేయడం సరికాదని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల పర్యావరణం, జీవావరణ పరిరక్షణలో ఈ జీవో ఎంతో కీలకమన్నారు. 84 గ్రామాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూమిలో హెచ్‌‌‌‌ఎండీఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అనువుగా జీవోను ఎత్తేయడం అంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని విపత్తులోకి నెట్టేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రిజర్వాయర్లను కాళేశ్వరం నీటితో నింపుతామని మంత్రి హరీశ్ రావు కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించడం సరికాదన్నారు. ఈ రెండు వాటర్ బాడీలను పరిరక్షించాలని తాను గతేడాది మార్చిలో హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌‌‌‌లో విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు. ఇప్పుడు ఎకో సెన్సిటివ్​జోన్‌‌‌‌గా ఉన్న ఆ 84 గ్రామాలు రానున్న రోజుల్లో కాంక్రీట్ జంగిల్‌‌‌‌గా మారిపోతాయని తెలిపారు. ఆదాయం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని, దీని పర్యవసానాలు భవిష్యత్‌‌‌‌లో చవి చూడాల్సి వస్తుందన్నారు. కర్నాటకలోనూ ఇలాంటి తప్పులే చేసి, ఆ పర్యావసనాలను ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల అనుభవిస్తున్నారని తెలిపారు.

కోర్టు తీర్పును అతిక్రమించారు..

జీవో 111 ఎత్తేయడంపై సుప్రీంకోర్టు 2001లో ఇచ్చిన తీర్పును అతిక్రమించడమేనని రాజేంద్ర సింగ్‌‌‌‌ అన్నారు. హించ్ లాల్ వర్సెస్ కమలాదేవి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సయీద్ షా ఖాద్రీ, జస్టిస్ ఎస్‌‌‌‌ఎస్ పుఖాన్‌‌‌‌ల బెంచ్ 2001లో హిమాయత్ సాగర్, గండిపేటల క్యాచ్‌‌‌‌మెంట్ ఏరియాను పరిరక్షిస్తూ తీర్పునిచ్చారని గుర్తుచేశారు. కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేయడం ద్వారా రానున్న వందేళ్ల వరకు కూడా ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదన్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వర్షాలతో సహజ ప్రవాహం, గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని వదులకొని భారీ ఖర్చుతో నీటిని ఎత్తిపోయడం అర్థరహితమని మండిపడ్డారు. సహజ వనరుల పరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత అని, తెలంగాణ ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. హిమాయత్‌‌‌‌ సాగర్, గండిపేట క్యాచ్‌‌‌‌మెంట్​ఏరియా పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వంపైనా ఒత్తిడి పెంచుతామనన్నారు.