వాట్సాప్ ఖాతా హ్యాకింగ్​తో పరేషాన్!​

వాట్సాప్ ఖాతా హ్యాకింగ్​తో  పరేషాన్!​

సామాజిక మాధ్యమం వాట్సాప్ ఖాతాలో ఉన్న సౌలభ్యాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా  దాదాపు 300 కోట్ల మంది  ప్రజలు ఈ మాధ్యమాన్ని వాడడం జరుగుతోంది.  ఈ మధ్యకాలంలో సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు వాట్సాప్  హ్యాకింగ్ బారినపడి  కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు.  ఒక సెల్​ఫోనులో ఉన్న వాట్సాప్ ఖాతాను ఇతర పరికరాల్లోకి కూడా మార్చుకుని వాడుకునే సౌలభ్యం ఉండడం వల్లనే  వాట్సాప్  హ్యాక్ అయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయి.  నిజానికి వాట్సాప్ హ్యాక్ అవడం వలన  మొత్తం ఫోన్​లో ఉన్న ఇతర సమాచారం, ఈమెయిల్స్, నోట్స్, బ్యాంక్ యాప్​ల వంటి వాటికి ప్రమాదం లేదు. కానీ,  వాట్సాప్ ఖాతాలో ఉన్న కాంటాక్ట్​లు హ్యాకర్ల అందుబాటులోకి వస్తాయి.  వాట్సాప్  ఖాతాను వేరొకరు హ్యాక్ చేసి ఉపయోగించడం జరిగితే, ఆ అపరిచిత వ్యక్తి అసలు ఖాతాదారు కాంటాక్ట్ నెంబర్లకు,  గ్రూప్​లకు ప్రాథమిక ఖాతాదారు పంపినట్టుగానే పోస్టింగులు పెట్టే అవకాశం ఉంది.  కాబట్టి వెంటనే హ్యాకింగ్ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయాలి..

ప్రాథమిక ఖాతాలోని  మొత్తం సమాచారాన్ని  హ్యాకర్ తన సొంత పరికరంలోకి  వాట్సాప్  వెబ్ ద్వారా మార్చుకొని తెలుసుకుంటాడు.  కాంటాక్ట్ లలో ముఖ్యమైన కొందరిని ఎంపిక చేసుకొని కొన్ని కారణాలు చూపుతూ అర్జెంటుగా వారు తెలిపిన బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపమని మెసేజ్ లు పోస్ట్ చేస్తారు.  కొందరు వాటిని నమ్మి తక్షణం స్పందించే అవకాశం ఉంది.  అనారోగ్యం,  అత్యవసరం  సాకుగా చూపిన  మోసపూరిత  సందేశాల ప్రభావంతో ఎందరో  డబ్బులు పంపిన ఘటనలు వింటున్నాం. ఇటువంటి  మోసాల బారినపడ్డవారిలో  సీనియర్  సిటిజన్లు, గృహిణులు ఎక్కువగా ఉంటున్నారు.  పైకం పంపమని వాట్సాప్ ద్వారా వచ్చే విన్నపాల విషయంలో జాగ్రత్త వహించి నిజ నిర్ధారణ చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు, కార్పొరేట్లు కూడా ఈ 
మాయాజాలంలో ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి.  గత సంవత్సరం డిసెంబర్ నెలలో  కేంద్ర హోంశాఖ ద్వారా ఏర్పడిన సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్ వారు సుమారు 60 వేల మోసపూరిత  వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేయించారు. 
నాలుగు పరికరాల్లో ఒకే వాట్సాప్ ఖాతాఒక ఫోన్​లో ఉన్న వాట్సాప్  ఖాతాను లింక్ చేసిన ఇతర ఫోన్, ట్యాబ్,  ల్యాప్​టాప్​లలో కూడా మార్పిడి చేసుకోవచ్చు. ఆ విధంగా ఒకే వాట్సాప్  ఖాతాని మొత్తం నాలుగు పరికరాల్లోకి తెచ్చుకోవచ్చు. మన సౌలభ్యం కోసం మరో ఫోన్ లేక  ట్యాబ్​లోకి  మార్చుకొని  మనమే వాడుకున్నంత వరకు ఏ సమస్య ఉండదు.  కానీ, మనకు తెలియకుండా ఇతరులు ఎవరైనా మన వాట్పాప్​ ఖాతాని వారి పరికరంలోకి మార్పిడి చేసుకుంటే మన ఖాతా హ్యాక్ చేసినట్టే. ఒకే వాట్సాప్ ఖాతాని  రెండు విధాలుగా ఇతర పరికరాల్లోకి మార్చుకోవచ్చు.  హ్యాకింగ్ చేయదలచుకున్న వ్యక్తి తను  డౌన్లోడ్  చేసుకున్న వాట్సాప్ ద్వారా పొందిన ఎనిమిది అంకెల కోడ్​ను తాను టార్గెట్​ చేసిన వ్యక్తికి మోసపూరిత విధానాల ద్వారా పంపి  దాన్ని తెరిచేవిధంగా ప్రేరేపించడం.  రెండో మార్గంలో వాట్సాప్ వెబ్,  ల్యాప్​టాప్​లలో చూపే  క్యూఆర్ కోడ్​ను  స్కాన్ చేయడం ద్వారా కూడా ప్రాథమిక వాట్సాప్ ను  లింక్  చేసుకోవచ్చు. హ్యాకింగ్ చేయదలచుకున్న వ్యక్తి ఈ  క్యూఆర్  కోడ్​ను  కూడా మోసపూరిత విధానాల ద్వారా ప్రాథమిక వాట్సాప్  ఖాతాదారునికి పంపే ఆస్కారం ఉంది. 

ఖాతా పునరుద్ధరణ 

వాట్సాప్​లో  అపరిచితుల చాట్​లు,  ప్రొఫైల్‌‌లో  అనధికారంగా మార్పులు,  స్టేటస్​ లేదా వ్యక్తిగత వివరాల మార్పులు జరిగినట్టు గమనిస్తే  ఖాతా హ్యాక్ చేసినట్టు గ్రహించాలి. ఆ విధంగా వాట్సాప్ ఖాతా నియంత్రణ కోల్పోతే, ఆ ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోవచ్చు.  పాత ఫోన్ నంబర్‌‌తోనే  మళ్లీ  డౌన్లోడ్  చేసిన వాట్సాప్​కి  సైన్ ఇన్ చేసి, సంక్షిప్త సందేశం లేదా ఫోన్‌‌కాల్ ద్వారా తెలిపిన 6- అంకెల కోడ్‌‌ను ఉపయోగించి తిరిగి రిజిస్టర్ చేసుకోవాలి.  వాట్సాప్ రిజిస్ట్రేషన్  కోడ్‌‌ను  ఇతరులకు తెలియనీయకూడదు. ఆ విధంగా 6- అంకెల కోడ్‌‌ని ఉపయోగించి వాట్సాప్ ఖాతాను తిరిగి నమోదు చేసుకున్న తర్వాత, మోసపూరితంగా ఖాతాను ఉపయోగిస్తున్న హ్యాకరు ఆ ఖాతా నుంచి తనంతట తానుగా లాగ్ అవుట్ అవుతాడు.  ఎందుకంటే  వాట్సాప్  ఒక  సమయంలో ఒక ఫోన్ నంబర్‌‌తో మాత్రమే నమోదు అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇటువంటి వాట్సాప్ ఖాతాను తిరిగి నమోదు చేసే సమయంలో  రెండు-దశల ధ్రువీకరణ పిన్ నమోదు చేయమనే సూచన వచ్చే అవకాశం ఉంది.  మనకు తెలియకుండా, ఇదివరకే ఖాతాను హ్యాక్​ చేసిన వ్యక్తి తానే రెండు-దశల ధ్రువీకరణను కూడా చేసి ఉండవచ్చు. అలాంటప్పుడు రెండు-దశల ధ్రువీకరణ పిన్ లేకుండా సైన్ ఇన్ చేయడానికి ముందు మీరు తప్పనిసరిగా 7 రోజులు వేచి ఉండాలి. 

వాట్సాప్ ఖాతాను సురక్షితంగా ఉంచే జాగ్రత్తలు

రిజిస్ట్రేషన్  కోడ్  లేదా  రెండు-దశల ధ్రువీకరణ పిన్‌‌ను ఇతరులతో ఎటువంటి పరిస్థితులలోనూ షేర్ చేయకూడదు.  వాట్సాప్ ఖాతాను వాడుతున్న ప్రతి ఒక్కరూ రెండు-దశల ధ్రువీకరణను తప్పనిసరిగా చేసుకోవాలి.  ఒకవేళ పిన్ నెంబర్ మర్చిపోయినా, ఈమెయిల్ ద్వారా తిరిగి పొందవచ్చు.  ఫోన్‌‌లో వాయిస్‌‌ మెయిల్ పాస్‌‌వర్డ్‌‌ను సెట్ చేసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్ ద్వారా లింక్డ్ డివైజ్‌‌లకు వెళ్లి  లింక్ చేసిన పరికరాలను తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలి. మన ప్రమేయం లేకుండా లింక్ అయిన పరికరాన్ని తీసివేయాలంటే  లాగ్ అవుట్ చేయాలి.  వాట్సాప్  సెట్టింగ్​లో  అకౌంటు - ప్రైవసీ - ప్రొఫైల్ ఫొటోకి వెళ్లి ప్రొఫైల్ పిక్చర్​ని చూసే అవకాశం కేవలం ఫోన్​లో భద్రపరిచిన కాంటాక్ట్​లకు  మాత్రమే  పరిమితం చేయాలి.  సెట్టింగ్​లో  ప్రైవసీ- అడ్వాన్స్డ్- ప్రొటెక్ట్ ఐపి అడ్రస్ ఎంచుకొని సురక్షితం చేసుకోవాలి.  మీరు అభ్యర్థించుకున్నా, రెండు-దశల ధ్రువీకరణ పిన్ లేదా రిజిస్ట్రేషన్ కోడ్‌‌ని రీసెట్ చేయడానికి మోసపూరిత  ఈమెయిల్స్ రావచ్చు.  అటువంటి ఈమెయిల్​ లింక్‌‌లపై  క్లిక్ చేస్తే,  వాట్సాప్ ఫోన్ నంబర్‌‌  హ్యాకర్ల అధీనంలోకి వెళ్ళిపోతుంది.  ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్​వర్డ్, వాట్సాప్  యూపీఐ పేమెంట్ వివరాలు తదితర  సమాచారాన్ని వాట్సాప్​లో  
పొందుపరచకపోవడమే మేలు.  ఇతరులు ఎవరైనా మన ఖాతాను  వాట్సాప్ వెబ్ /  డెస్క్ టాప్/ ల్యాప్​టాప్ ద్వారా ఉపయోగిస్తున్నట్టు అనుమానముంటే వెంటనే మన ఫోన్ /వెబ్/డెస్క్‌‌టాప్‌‌/  ల్యాప్​టాప్​లో  వాట్సాప్ నుంచి లాగ్ అవుట్ చేయాలి.  వాట్సాప్ ని  తెరవగానే ‘మీ ఫోన్ నంబర్​తో గల వాట్సాప్ కొత్త పరికరంలో నమోదైంది’ అనే సందేశం కనపడితే దాన్ని అనధికార లావాదేవీగా గుర్తిస్తే,  వెంటనే మీ ఖాతాను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని గుర్తించాలి. 

నిర్ధారించుకోవడం ఎలా?

ఇతరులు ఎవరైనా వాట్సాప్  సందేశాలను మరొక పరికరం నుంచి చూస్తున్నారో  లేదో  నిర్ధారించుకుంటూ ఉండాలి. వాట్సాప్ సెట్టింగ్‌‌లు తెరిచి లింక్డ్  పరికరాలకు వెళ్లి పరిశీలించాలి.  ఒకవేళ తెలియని పరికరానికి వాట్సాప్ లింకు చేసిఉంటే,  అటువంటి అనధికార యాక్సెస్‌‌ను వెంటనే  డిలీట్ చేయాలి.  ఇతరులు కేవలం వాట్సాప్ లో  సందేశాలు  పంపడం ద్వారా మన ఖాతాని హ్యాక్  చేయడం కుదరదు.  హానికరమైన లింక్‌‌ను క్లిక్ చేయడం, కొత్త వ్యక్తులు పంపిన అటాచ్‌‌మెంట్‌‌ను  తెరవడం,  ఓటీపీలను వెల్లడించడం వంటివి చేస్తే ముప్పు తప్పదు.  మన  అనుమతి లేకుండా మన  ఫోన్​లోనే  వాట్సాప్ ఖాతాను  ఇతరులు ఎవరైనా ఉపయోగించవచ్చు. కాబట్టి ఫోన్​ను కూడా పిన్ నంబరుతో  లేదా వేలిముద్రలతో లాక్ చేసి ఉంచాలి. 

- ఆర్ సి కుమార్,
సామాజిక కార్యకర్త