వాట్సప్​ వ్యవసాయం .. అడ్మిన్​లుగా ఏవో, ఏఈవోలు

వాట్సప్​ వ్యవసాయం .. అడ్మిన్​లుగా ఏవో, ఏఈవోలు
  • పాలమూరు జిల్లాలో ప్రతి మండలానికి ఒక గ్రూప్ ఏర్పాటు
  • గ్రూపులో 250 నుంచి 300 మంది రైతులు
  • ప్రతి సమాచారం క్షణాల్లో అందరికి చేరవేత

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో వ్యవసాయ అధికారులు రైతులకు స్పీడ్​గా సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్​లోని వాట్సప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు సాగులో మెలకువలు, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. 

పంటలకు తెగుళ్లు, ఇతర చీడ పీడలు ఆశిస్తే.. వాటి ఫొటోలు తీసి రైతులు గ్రూపులో పోస్ట్​ పెడితే, వెంటనే వాటి పరిష్కారానికి సూచనలు చేస్తున్నారు. అవసరమైతే ఫీల్డ్ విజిట్ కు వచ్చి పంటను పరిశీలిస్తున్నారు. ప్రతి మండల వ్యవసాయాధికారి పరిధిలో మండల స్థాయిలో ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. 

వ్యవసాయ క్లస్టర్​ల వారీగా ఏఈవోలు కూడా గ్రామ స్థాయిలో గ్రూపులను క్రియేట్ చేశారు. ఈ గ్రూపుల్లో వ్యవసాయంలో యాక్టివ్​గా ఉన్న రైతులు, యువ రైతులను దాదాపు 250 మంది నుంచి 300 మంది వరకు జాయిన్ చేశారు. సాగు సంబంధ అప్​డేట్స్ ఎప్పటికప్పుడు ఈ గ్రూపుల్లో పోస్ట్ చేసి రైతులను చైతన్యం చేస్తున్నారు. వారి ద్వారా గ్రామాల్లోని ప్రతి రైతుకు వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలు వేగంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రతి ఇన్ఫర్మేషన్ గ్రూపులో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేస్తున్న స్కీములు గురించి, వరి, పత్తి, మక్కలు, పల్లి ఇతర వాణిజ్య పంటలు, హార్టికల్చర్ పంటలకు అందించే సబ్సిడీల గురించి ఆఫీసర్లు గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. చీడ పీడలు, తెగుళ్లు తదితర వాటిపై అగ్రికల్చర్ యూనివర్సిటీల శాస్ర్తవేత్తలు అందించే సూచనలు, సలహాలను ఫార్వర్డ్ చేస్తున్నారు. కొత్త వంగడాలు, ఆధునిక సాగు పద్ధతుల వీడియోలను షేర్​ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు ఆఫీసర్లు గ్రూపుల్లో వివరిస్తున్నారు. ఏ రకం మందులు ఎంత మోతాదులో వేయాలని సూచిస్తున్నారు.

హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ కూడా..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగయ్యే మామిడి తోటలను హార్టికల్చర్ క్లస్టర్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంపిక చేసింది. ఐదేండ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగనుంది. దీంతో ఉమ్మడి జిల్లా మామిడి తోటల రైతులతో కలిసి వాట్సప్​ గ్రూపు క్రియేట్ చేశారు. ఎప్పటికప్పుడు రైతులకు మామిడి తోటల సాగులో, పూత రాలకుండా, పిందెకు పురుగు పట్టకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి గ్రూపులో వివరిస్తున్నారు. 

తోటలకు సమస్య వస్తే రైతులు వీడియో కాల్స్ చేసినా.. దానికి ఆఫీసర్లు రెస్పాండ్ అవుతున్నారు. వీడియో ద్వారా తోటలను పరిశీలించి, వాటికి ఆశించిన తెగుళ్లు, చీడ పీడల గురించి వివరించి.. వాటి నివారణకు సూచనలు చేస్తున్నారు