Layoffs: ఇన్నాళ్లూ జీతాలే లేట్ చేసింది.. ఇప్పుడు  200 మంది ఉద్యోగులను ఉన్నపళంగా పీకేసింది..

Layoffs: ఇన్నాళ్లూ జీతాలే లేట్ చేసింది.. ఇప్పుడు  200 మంది ఉద్యోగులను ఉన్నపళంగా పీకేసింది..

చెన్నైకి చెందిన వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఆహార సరఫరా సంస్థ వేకూల్ ఫుడ్స్ (WayCool Foods) ఉన్నపళంగా 200 మంది ఉద్యోగులను తొలగించింది. గడచిన 12 నెలల్లో ఈ సంస్థ ఇప్పటికి మూడు సార్లు ఉద్యోగులను పీకేసింది. స్టార్టప్ సంస్థ కావడం, ఫండింగ్ సమస్య విపరీతంగా ఉండటంతో ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నట్లు సమాచారం. గతేడాది జులైలో కూడా 300 మంది ఉద్యోగులను వేకూల్ ఫుడ్స్ సంస్థ తొలగించింది. అంతదాకా ఎందుకు.. ఈ సంవత్సరం 2024, ఫిబ్రవరిలో కూడా 70 మంది ఉద్యోగాలను ఊడగొట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వాళ్లపై కూడా తాజా లే-ఆఫ్స్ ప్రభావం పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత కొన్ని నెలలుగా జీతాలు కూడా ఆలస్యంగా చెల్లిస్తున్న వేకూల్ ఫుడ్స్ సంస్థ ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల మెడపై కత్తి పెట్టడమే శరణ్యం అని భావిస్తోంది. జూన్ నెల పే స్లిప్స్ ప్రాసెస్ చేస్తున్నామని, క్లైంట్స్ నుంచి సంస్థకు రావాల్సిన పేమెంట్స్ నిలిచిపోయాయని యాజమాన్యం చెబుతోంది. లాభాలను ఆర్జించడం కోసం ఉద్యోగులను తొలగించాలని వేకూల్ ఫుడ్స్ సంస్థ భావించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక.. ఫండింగ్ విషయానికొస్తే.. లైట్ రాక్(LightRock), లైట్ బాక్స్(LightBox), అస్పద(Aspada), ఎఫ్ఎంఓ(FMO), Lightsmith (లైట్ స్మిత్), ఐఎఫ్సీ (World Bank Group’s IFC), రెడ్ వుడ్ ఈక్విటీ పార్టనర్స్ (Redwood Equity Partners) నుంచి వేకూల్ ఫుడ్స్ సంస్థలోకి 341 మిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయని డేటా ప్లాట్ఫాం ట్రాక్స్న్ (Tracxn) వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ లాభనష్టాలకు సంబంధించి వార్షిక నివేదికను ఈ సంస్థ ఇప్పటివరకూ ప్రకటించలేదు. 2023లో 1,251 కోట్ల ఆదాయం, 2022లో 772 కోట్ల ఆదాయం వేకూల్ ఫుడ్స్ ఆర్జించినట్లు ఎన్ట్రాకర్ (Entrackr) తెలిపింది. 2015లో ఈ వేకూల్ ఫుడ్స్ సంస్థను కార్తీక్ జయరామన్, సంజయ్ దాసరి స్థాపించారు. అశోక్ లీలాండ్ మాజీ హెడ్ వినోద్ దాసరి కొడుకే ఈ సంజయ్ దాసరి. వ్యవసాయ ఆధారిత ఆహార ఉత్పత్తుల చైన్ సంస్థ కావడంతో దేశవ్యాప్తంగా 2 లక్షల మంది రైతులతో కలిసి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.