
ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో ఎలిజిబిలిటీ టెస్టులున్నా ప్రధానంగా చెప్పుకునేవి పదిలోపే. అవి టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, శాట్, జీమ్యాట్, పీటీఈ, ఏసీటీ. ఇందులో కొన్ని ఇంగ్లిష్ ఫ్లూయెన్సీ టెస్టులు కాగా మరికొన్ని యాప్టిట్యూడ్ పరీక్షలు. దాదాపు అన్ని టెస్టులను అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూషన్లు నిర్వహిస్తుండగా కొన్ని బ్రిటిష్ కౌన్సిల్, ఆస్ర్టేలియాలు జరుపుతాయి. అన్ని పరీక్షల్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై అభ్యర్థికున్న అవగాహనను ప్రధానంగా టెస్ట్ చేస్తారు. ఇందుకుగాను బిగ్గరగా చదవడం, సినిమాలు, రేడియోల్లోని సంభాషణలు వినడం, ఇతరులతో డిస్కస్ చేయడం, మాట్లాడటం, నచ్చిన అంశాలను పదే పదే రాయడం వంటి వాటి ద్వారా ఇంగ్లిష్ స్కిల్స్ పెంచుకోవచ్చు. అలాగే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీని కూడా పరీక్షిస్తారు కాబట్టి ఆయా పరీక్షల్లో అడిగే మోడల్స్ ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
జీఆర్‌ఈ
గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (GRE).. విదేశీ యూనివర్శిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంజినీరింగ్, సైన్స్, ఎంబీఏ, ఎంఎస్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు, ఫెలోషిప్‌లు, పీహెచ్‌డీలో అడ్మిషన్లకు రాయాల్సిన పరీక్ష. 130కి పైగా దేశాల్లో దాదాపు నాలుగు వేల ఇన్స్టిట్యూషన్లు ఈ స్కోర్‌ను ఆమోదిస్తాయి. 10+2+4 విధానంలో చదివినవారు అర్హులు. ఆన్‌లైన్, ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు 205 డాలర్లు. ఐదేళ్ల వరకు వ్యాలిడిటీ ఉండే జీఆర్ఈను ప్రతి పరీక్షకు నెలరోజుల వ్యవధితో సంవత్సరానికి అయిదుసార్లు రాయవచ్చు. ఇందులో 600 మార్కులు తెచ్చుకోగలిగితే టాప్ వర్శిటీల్లో అడ్మిషన్ ఖాయం.
పరీక్షా విధానం
ఆన్‌లైన్ లేదా పెన్ అండ్ పేపర్ బేస్డ్ పరీక్ష ఇది. సమయం 3 గంటల 45 నిమిషాలు. అనలిటికల్ రైటింగ్, వెర్బల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, ఎక్స్పరిమెంటల్ సెక్షన్‌ల నుంచి క్రిటికల్ థింకింగ్ అనలిటికల్ రైటింగ్ ను పరీక్షించేలా ప్రశ్నిలిస్తారు. దీంతో పాటు లిటరేచర్ ఇన్ ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కెమిస్ట్రీ వంటి ఏడు రకలా సబ్జెక్టు టెస్టులు రాయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్: www.ets.org/gre
టోఫెల్
ఇంగ్లిష్ మాట్లాడని దేశాల విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలంటే రాయాల్సిన పరీక్ష ‘టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ (TOEFL). అమెరికాకు చెందిన ఇంగ్లిష్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) నిర్వహించే ఈ పరీక్షలో విద్యార్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రశ్నాపత్రం రూపొందిస్తారు. దాదాపు 135 దేశాలు 10 వేలకు పైగా విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూషన్లు టోఫెల్ స్కోర్‌ను ఆమోదిస్తున్నాయి. సంవత్సరం మొత్తం 50కి పైగా స్లాట్లలో నిర్వహించే టోఫెల్ కు ఆన్‌లైన్, ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజు 170 అమెరికా డాలర్లుగా ఉంది. అటెంప్ట్స్పై పరిమితి లేదు. రాసిన ప్రతిసారి ఫీజు చెల్లించాల్సిందే.
పరీక్షా విధానం
టోఫెల్ టెస్ట్ డ్యురేషన్ నాలుగు గంటలు. రీడింగ్, స్పీకింగ్, లిజనింగ్ అండ్ రైటింగ్ అనే నాలుగు విభాగాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష 120 పాయింట్లకు ఉంటుంది. గరిష్టంగా 80 పాయింట్లు పొందితే టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ లభిస్తుందని చెప్పవచ్చు. ఈ స్కోరుకు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.
రీడింగ్: ఇందులో స్టూడెంట్ అండర్స్టాండింగ్ కెపబిలిటీ, కాన్సన్ట్రేషన్ వంటివి పరీక్షిస్తారు. 60 నుంచి 80 నిమిషాల పాటు నిర్వహించే రీడింగ్‌లో 3 నుంచి 4 ప్యాసేజ్‌లు ఇచ్చి ప్రశ్నలడుగుతారు.
లిజనింగ్: గంట నుంచి గంటన్నర పాటు నిర్వహించే లిజనింగ్ టెస్ట్ ఉద్దేశం అభ్యర్థి ఇంగ్లిష్ ను విని ఏమాత్రం అర్థం చేసుకుంటున్నాడో పరీక్షించడమే. ఇందులో 50 దాకా ప్రశ్నలిస్తారు. సులువుగా అర్థమయ్యే భాషలోనే స్పీచెస్, కన్వర్జేషన్స్ విని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
స్పీకింగ్: అతి తక్కువగా 20 నిమిషాల పాటు ఉండే ఈ టెస్టులో అభ్యర్థి విని, చదివిన అంశాలపై మాట్లాడాలి. ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్ చూడటమే దీని ప్రధాన ఉద్దేశం. హెడ్సెట్, మైక్రోఫోన్ల ద్వారానే మాట్లాడాలి.
రైటింగ్: ఇందులో ఏదైనా ఒక అంశాన్ని చదివి రాయడం, మరో అంశంపై సొంతంగా అభిప్రా యాలు చెబుతూ రాయడం అనే రెండు టాస్క్ లుంటాయి. అభ్యర్థి ఆలోచనలను అంచనా వేసేదే ఈ టెస్టు. దాదాపు గంటపాటు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.ets.org/toefl
శాట్
విదేశాల్లో బ్యాచిలర్ డిగ్రీ, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష స్కాలాస్టిట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT). దీనిని అమెరికాకు చెందిన కాలేజ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సంవత్సరానికి ఆరుసార్లు నిర్వహించే ఈ పరీక్షకు ఇంటర్/10+2 ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. ఏటా రెండు సార్లు మాత్రమే రాయాలి. స్కోర్ ఐదేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. దీని ఆధారంగా కొన్ని వర్శిటీలు స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు కూడా అందిస్తున్నాయి. స్పెషలైజేషన్ చయాలనుకునేవారు సంబంధిత శాట్ సబ్జెక్టు టెస్టులు రాయాలి.
పరీక్షా విధానం
ఆన్లైన్లో నిర్వహించే శాట్‌లో రీడింగ్, రైటింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో ప్రశ్నలిస్తారు. సమయం 3 గంటల 45 నిమిషాలు. ప్రతి సెక్షన్ లో 200–800 స్కోర్ ఉంటుంది. రెండు వేలకు పైగా స్కోరు సాధిస్తే మంచి ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ పొందవచ్చు.
వెబ్‌సైట్: www.sat.collegeboard. org
ఐఈఎల్‌టీఎస్
ఆస్ర్టేలియా, బ్రిటిష్, కెనడా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తో పాటు 140 దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలతో పాటు విదేశాల్లో ఉద్యోగం, ఇతర ట్రైనింగ్లకు వెళ్లేవారు రాయాల్సిన పరీక్ష ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (IELTS). దీనిని బ్రిటిష్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ కౌన్సిల్ – ఐడీపీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో రెండు రకాలున్నాయి. స్టడీస్ కోసం రాసేది అకడమిక్ ఐఈఎల్‌టీఎస్ అయితే ఉద్యోగార్థులు, ఇతరులు రాయవలసింది జనరల్ ఐఈఎల్‌టీఎస్. నెలకు నాలుగు సార్ల చొప్పున సంవత్సరానికి 48 సార్లు నిర్వహించే ఈ పరీక్ష స్కోర్ రెండేళ్ల పాటు చెల్లుబాటవుతుంది. ఎన్నిసార్లయినా రాయవచ్చు. ఫీజు దాదాపు రూ.12 వేలుగా ఉంటుంది.
పరీక్షా విధానం
ఐఈఎల్‌టీఎస్ పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్. పెన్సిల్‌తో కూడా రాయవచ్చు. టోఫెల్ మాదిరిగా దీనిలోనూ రైటింగ్, రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అనే నాలుగు విభాగాల్లో రెండు గంటల 45 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఇందులో లిజనింగ్ 30 నిమిషాలు, రీడింగ్ 60, రైటింగ్ 60, స్పీకింగ్ 15 నిమిషాల పాటు ఉంటుంది. స్కోర్ బ్యాండ్ 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది. 6.5 కంటే ఎక్కువ వస్తే టాప్ ఇన్‌స్టిట్యూట్‌లలో అడ్మిషన్ ఆశించవచ్చు.
వెబ్‌సైట్: www.ielts.org, www.ieltsidpindia.com
జీమ్యాట్
ఎంబీఏ, ఇతర ఫైనాన్స్ రిలేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GMAT). దీనిని అమెరికాకు చెందిన గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు వేల ఇన్స్టిట్యూట్లు ఈ స్కోర్‌ను ఆమోదిస్తున్నాయి. మూడేళ్ల వ్యాలిడిటీ ఉండే జీమ్యాట్ పరీక్షను సంవత్సరానికి 5 సార్లు రాయవచ్చు. ఫీజు 250 యూఎస్ డాలర్లు. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలున్నాయి.
పరీక్ష విధానం
ఇది ఆన్‌లైన్ పరీక్ష. అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అండ్ వెర్బల్ ఎబిలిటీ అనే నాలుగు విభాగాల్లో 800 పాయింట్లకు ప్రశ్నలిస్తారు. సమయం మూడున్నర గంటలు. ఇందులో కనీసం 600 మార్కులు వస్తే టాప్ వర్శిటీల్లో సీటు ఆశించవచ్చు.
వెబ్‌సైట్: www.mba.com/india
పీటీఈ
పీటీఈ అంటే పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్. విదేశీ వర్శిటీలు, ఇన్స్టిట్యూషన్లలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రాయాల్సిన పరీక్ష ఇది. దీనిని యూఎస్, యూకేలతో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి ఇన్స్టిట్యూషన్లు ఆమోదిస్తున్నాయి. 50 కి పైగా దేశాల్లో 2 వందల టెస్టు సెంటర్లున్నాయి. ఫీజు దాదాపు 13 వేలు.
పరీక్షా విధానం
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన పీటీఈ లో స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. సమయం 3 గంటలు. 10 నుంచి 90 పాయింట్లకు నిర్వహించే పీటీఈలో 58 కి పైగా స్కోర్ సాధిస్తే మంచిది.
వెబ్‌సైట్: http://pearsonpte.com
ఏసీటీ
అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే రాయాల్సిన పరీక్ష అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ACT). శాట్ తో పాటు యూఎస్‌లోని పలు వర్శిటీలు యాక్ట్ టెస్ట్‌ను ఆమోదిస్తున్నాయి. ఇంటర్/10+2 ఉత్తీర్ణులైన వారు దీనికి అర్హులు. సంవత్సరానికి ఆరుసార్లు నిర్వహించే ఈ పరీక్ష స్కోర్ వ్యాలిడిటీ ఐదేళ్లు. ఫీజు 48 డాలర్లు.
పరీక్షా విధానం
ఇది ఆఫ్‌లైన్ పరీక్ష. ఇందులో ఇంగ్లిష్ నుంచి 75 ప్రశ్నలు (45 ని.), మ్యాథ్స్‌లో 60 ప్రశ్నలు (60 ని.), సైన్స్‌లో 40 ప్రశ్నలు (35 ని.), రీడింగ్ నుంచి 40 ప్రశ్నలు (35 ని.) ఇస్తారు. ఆప్షనల్ రైటింగ్ టెస్ట్ 40 నిమిషాలు ఉంటుంది. మొత్తం సమయం 3 గంటల 35 నిమిషాలు.
వెబ్‌సైట్: www.act.org