
- డిసెంబర్ 31 వరకు విధుల్లో కొనసాగొచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాదిమంది టీచర్లకు స్వల్ప ఊరట లభించింది. విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతుందనే వినతుల నేపథ్యంలో వారి సర్వీసును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్మొత్తం 25,753 మందిని సుప్రీంకోర్టు విధుల్లోంచి తొలగిస్తూ ఇటీవల తీర్పు చెప్పింది.
ఈ తీర్పుపై ప్రభుత్వం, పలువురు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను గురువారం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ బెంచ్ విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనల తర్వాత బెంచ్ స్పందిస్తూ.. టీచర్లకు మాత్రమే సర్వీసు పొడిగింపును మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న, ఎయిడెడ్ స్కూళ్లలో గ్రేడ్ సీ, గ్రేడ్ డీ ఉద్యోగులకు వర్తించదని తెలిపింది.
‘‘9వ క్లాస్ నుంచి 12 క్లాస్వరకు అసిస్టెంట్ టీచర్లకు సంబంధించిన ప్రస్తుత పిటిషన్లో కొన్ని షరతులకు లోబడి అభ్యర్థనను అంగీకరించడానికి మేము మొగ్గు చూపుతున్నాము’’ అని ఈ సందర్భంగా సీజేఐ అన్నారు. అప్పటిలోగా కొత్త టీచర్లను, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి మే 31వ తేదీ కంటే ముందే నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు.