WCL 2024: రైనా పోరాటం వృథా.. పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం

WCL 2024: రైనా పోరాటం వృథా.. పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఆదివారం(జులై 07) ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్.. 68 పరుగుల తేడాతో ఇండియా ఛాంపియన్స్‌ను చిత్తు చేసింది. తొలుత పాక్ 244 పరుగుల భారీ స్కోర్ చేయగా.. దాన్ని ఛేధించడంలో భారత బ్యాటర్లు చతికిలపడ్డారు. 175 పరుగులకే పరిమితమయ్యారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. కమ్రాన్‌ ఆక్మల్‌ (77), షర్జీల్ ఖాన్ (72), సోహైబ్ మసూద్‌ (51) హాఫ్ సెంచరీలు చేయగా.. షోయబ్ మాలిక్ (25) విలువైన పరుగులు చేశాడు. ఫలితంగా, పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

అనంతరం 244 పరుగుల భారీ చేధనకు దిగిన భారత బ్యాటర్లు ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. సురేశ్ రైనా (52; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లలో అంబటి రాయుడు (39), రాబిన్ ఊతప్ప (22) కాస్త ఫర్వాలేదనిపించారు.  నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి ఇండియా 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో.. షోయబ్ మాలిక్, వహాబ్ రియాబ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. 

మూడో స్థానంలో భారత్

ఈ విజయంతో పాకిస్తాన్(3 మ్యాచ్‌ల్లో 3 విజయాలు; 6 పాయింట్లు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కూర్చొంది. ఇక 4 పాయింట్ల చొప్పున ఆస్ట్రేలియా, భారత జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి.