
చెన్నై: భాషా సమానత్వమే తాము కోరుకుంటున్నామని తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ అన్నారు. తమిళనాడులో తమిళ భాషకు ప్రాధాన్యం కల్పించమని అడిగితే దానిని దురభిమానమని కొందరు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. హిందీ మతోన్మాదులే నిజమైన దురభిమానులు, దేశ వ్యతిరేకులని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’ లో ఆయన పోస్ట్ పెట్టారు.
‘‘మీరు ప్రత్యేక హక్కులకు అలవాటు పడిన తర్వాత సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుంది” అని సూక్తిని ప్రస్తావించారు. ‘‘తమిళనాడులో తమిళానికి ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేసినందుకు మాది దురభిమానమని ముద్ర వేస్తున్నారు. దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు క్రిమినల్ చట్టాలకు పేర్లు పెట్టడంలా ఉంటుంది.
ఎన్‌ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుంది’’ అని స్టాలిన్ విమర్శించారు.