విశాఖ ట్రస్టు ద్వారా ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నాం: సరోజా వివేక్ వెంకటస్వామి

విశాఖ ట్రస్టు ద్వారా ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నాం: సరోజా వివేక్ వెంకటస్వామి

విశాఖ ట్రస్టు ద్వారా విద్యారంగంలో ఆడపిల్లలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సరోజా వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సరోజ వివేక్ హాజరయ్యారు. ఆదర్శ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఆమె మాట్లాడారు.

విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 30 ఏళ్లు అవుతోందని, పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. అదే విధంగా తరగతి గదులు నిర్మించి విద్యాలయాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.  ఆర్థిక భారం లేకుండా విద్య అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని, ‘‘చదువుకోగలిగితే ఆకాశమే హద్దు... మనల్ని ఏది ఆపలేదు’’ అని అన్నారు. డబ్బుంటేనే విశ్వాసం వస్తుందని అనుకోవద్దని,  సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నత స్థితికి చేరుస్తుందని చెప్పారు.

అప్పట్లో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా 14 ఏళ్ల వయసులోనే కాకా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని..  కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేశారు. తన లాంటి ఎన్నో కుటుంబాలకు సాయ పడ్డారని అన్నారు. అంబేద్కర్ ఎడ్యుకేషనల్ఇన్స్టిట్యూషన్ పెట్టి యాభై ఏళ్లు అయ్యిందని, మొదటి నుంచీ విద్యా రంగంలో రాణించేందుకు ఎంతో మందిని ప్రోత్సహించినట్లు తెలిపారు.

‘‘నేను సక్సెస్ అయ్యాను అంటే మా కుటుంబ సభ్యుల మద్ధతు కారణం.. ఒక కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు.’’ అని ఈ సందర్భంగా సరోజా వివేక్ అన్నారు. మల్టీ టాస్కింగ్, సెల్ఫ్ రెస్పెక్ట్తో మహిళలు ముందుకు సాగాలని సూచించారు. మంచి మనసుతో, పట్టుదలతో ముందుకెళ్తే విజయం వరిస్తుందని, మహిళలు ఎప్పడూ ఆత్మన్యూనతాభావనతో ఉండవద్దని సూచించారు.