మేం పరిశీలిస్తున్నం.. యూఎస్ టారిఫ్ల ప్రభావం, అవకాశాలపై ఇండియా

మేం పరిశీలిస్తున్నం.. యూఎస్ టారిఫ్ల ప్రభావం, అవకాశాలపై ఇండియా

న్యూఢిల్లీ:  అమెరికా విధించిన 27 శాతం రెసిప్రోకల్​ సుంకాలపై భారత్​ స్పందించింది. ఈ సుంకాల ప్రభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నది. ఈ మేరకు గురువారం భారత వాణిజ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా తీసుకున్న టారిఫ్​ల నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది. 

అదే సమయంలో ఈ కొత్త వాణిజ్య విధానం వల్ల ఏర్పడే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ ట్యాక్స్​లను   సవాలుగానే కాకుండా.. వాణిజ్య ఒప్పందాలను మెరుగుపరచుకునే అవకాశంగా కూడా చూస్తున్నామని తెలిపింది. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని,  ఈ ఏడాది చివరినాటికి మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే లక్ష్యంతో పని చేస్తున్నట్టు భారత వాణిజ్య శాఖ తెలిపింది. ఈ చర్చల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక బదిలీలను పెంచడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నది. 

ప్రస్తుతానికి అమెరికాపై రెసిప్రోకల్ ట్యాక్స్​ను విధించే ఆలోచన లేదని, బదులుగా సంప్రదింపుల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. ఈ విధానం ద్వారా భారత్ తన ఎక్స్​పోర్ట్స్​ను కాపాడుకోవడంతో పాటు అమెరికాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నది. కాగా, ట్రంప్​ విధించిన సుంకాలపై చర్చించేందుకు పీఎంవో కార్యాలయం గురువారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించింది. పీఎం ప్రధాన కార్యదర్శి ఈ హైలెవల్​ మీటింగ్​కు అధ్యక్షత వహించగా.. వాణిజ్య మంత్రిత్వ శాఖ. నీతి ఆయోగ్​,  ఇతర విభాగాల సీనియర్​ అధికారులు పాల్గొన్నారు.