పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సామాజిక పింఛన్లు పెద్ద సంఖ్యలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మొత్తం 46లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్న ఆయన..ఇందుకు ఏటా 12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఫించన్లు మంజూరైన 5,678మందికి అర్హత కార్డులను ఆయన పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మానవతా మూర్తి అన్న గంగుల.. తెలంగాణ గొప్ప లౌకిక, సంక్షేమరాజ్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందుతున్న పెన్షన్లలో కేంద్రం వాటా వందలో కేవలం రూ.1.80 పైసలు మాత్రమే అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తామని.. పెన్షన్ రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని చెప్పారు.