నిర్మాణ రంగ కార్మికులు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్

నిర్మాణ రంగ కార్మికులు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్

హైదరాబాద్: నిర్మాణ రంగ కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. క్రెడాయి, ట్రేడా, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో గురువారం  మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ... హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో కార్మికులు అవసరం చాలా ఉందని, అందుకోసం రానున్న రోజుల్లో మరింత మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం బిల్డర్లతో కలిసి కార్మిక శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల దుబాయికి వలసలు తగ్గి... హైదరాబాద్ నగరానికి వేరే రాష్ట్రాల నుంచి కార్మికులు వస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని, అటు ఢిల్లీలో.. ఇటు గల్లీలో ఆ పార్టీ గెలవడం అసాధ్యమన్నారు. సోనియా, రాహుల్ ఈడీ కేసు విషయంలో హైదరాబాద్ లో కాదు... దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మంత్రి సవాల్ విసిరారు. ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీకి నియోజకవర్గాల్లో పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా లేరన్న మంత్రి... ఎన్నికల్లో గెలవడం కోసం ఆ రెండు పార్టీలు కృత్రిమ సమస్యలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లిద్దరూ ఐరన్ లెగ్స్ అని, వాళ్ల ఆధ్వర్యంలో ఆయా పార్టీలు ఓడిపోవడం ఖాయమన్నారు.