* ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించండి
* ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి
* డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయండి
* రాష్ట్రంలో 30% జనాభా ఇక్కడే ఉంటుండ్రు
* జనాభాకు అనుగుణంగా అభివృద్ది అవసరం
* హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ మాత్రమే కాదు
* పాతనగరంపైనా దృష్టి సారించాలి
* కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
హైదరాబాద్: మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ముషీరాబాద్ పరిధిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి సీవరేజ్ లైన్ ను ప్రారంభించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి, అభివృద్ధి చేయాలన్నారు. మూసీ పునరుద్ధరణ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు.
తెలంగాణలో 30% జనాభా హైదరాబాద్ లోనే ఉంటున్నారని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి అవసరమని అన్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గాలేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అనేక ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్లలో మురుగు నీరు కలవడంతో ప్రజలు రోగాన బారిన పడుతున్నారని అన్నారు.
ALSO READ | హైదరాబాద్‌కు మూసీ గుండెకాయ లాంటిది : మంత్రి దామోదర రాజనర్సింహ
నగరంలో డ్రైనేజీ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు అరకొరగా నిధులు విడుదల చేయడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలే కాదనేది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. సనత్ నగర్, ఖైరతాబాద్, గౌలిపుర వంటి అనేక ప్రాంతాల్లో రోడ్ల గుంతలను పూడ్చడంతో పాటు డ్రైనేజీ సిస్టమ్ ను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని సూచించారు.