
న్యూయార్క్: ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు తామూ సిద్ధంగానే ఉన్నామని, కానీ దీనిపై కొన్ని సందేహాలు ఉన్నాయని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ డీల్‌కు సంబంధించి అనేక అంశాలపై చర్చించి, ఒక నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. దీనిపై త్వరలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌తో మాట్లాడతానని చెప్పారు.
కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ బుధవారం హెచ్చరించిన నేపథ్యంలో పుతిన్ గురువారం ఈ మేరకు స్పందించారు. ఉక్రెయిన్ సమస్యపై దృష్టి సారించి, శాంతి స్థాపనకు కృషి చేస్తున్నందుకు గాను భారత ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇది తాత్కాలిక ఉపశమనమే..
ఉక్రెయిన్–రష్యా మధ్య సీజ్ ఫైర్కోసం యూఎస్–ఉక్రెయిన్చేసిన ప్రతిపాదనపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు సన్నిహితంగా ఉండే ఉన్నతాధికారి యూరి ఉషాకోవ్ విమర్శలు చేశారు. ఇది ఉక్రెయిన్ఆర్మీకి తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని వ్యాఖ్యానించారు. కురుస్క్ నుంచి ఉక్రెయిన్‌బలగాలు వెనక్కి ఓవైపు 30 రోజుల సీస్‌ఫైర్‌పై అమెరికా ఆధ్వర్యంలో చర్చలు జరుగుతుంటే రష్యా అధికారులు కీలక ప్రకటన చేశారు.
రష్యాకు చెందిన కుర్స్క్బోర్డర్ నుంచి ఉక్రెయిన్దళాలను తరిమికొట్టినట్టు ప్రకటించారు. కుర్క్స్ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం అక్కడ పుతిన్ పర్యటించారు. తర్వాత కొన్ని గంటల్లోనే అధికారులు ఉక్రెయిన్ దళాలను వెళ్లగొట్టినట్టు ప్రకటించాయి. అయితే, దీనిపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.