మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో అరెస్టయి, విడుదలైన రాఘవేందర్ రాజు, మున్నూరు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని రాఘవేందర్ రాజు అన్నారు. శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి బెయిల్ మీద విడుదలయిన రాఘవేందర్, మున్నూరు రవి మీడియాతో మాట్లాడారు.
‘మహబూబ్ నగర్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మాపై శ్రీనివాస్ గౌడ్ తప్పుడు కేసుల పెట్టించి వేధిస్తున్నాడు. అర్హతలేని మనిషి మంత్రి హోదాలో కొనసాగుతున్నాడు. ఎన్నికల కమిషన్ను మోసం చేసిన విషయం బయటపడుతుందనే మా పై కేసులు పెట్టారు. ఎన్నికల కమిషన్కు అఫిడవిట్ వేయడంతో మేం టార్గెట్ అయ్యాం. దొంగల్లా మమ్మల్ని కిడ్నాప్ చేసి.. అరెస్ట్ చేయించారు. శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర చేశాం అంటున్నారు. మరి ఆయన ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. తప్పుడు కేసులపై మేం లీగల్గా పోరాటం చేస్తాం. రిమాండ్ రిపోర్టులో నమోదు చేసిన తేదీల్లో.. మేం ఎక్కడెక్కడ ఉన్నామో ఆధారాలున్నాయి. వాటికి సంబంధించి మా దగ్గర ఫ్లైట్, ట్రైన్, బస్ టికెట్స్ కూడా ఉన్నాయి’ అని రాఘవేందర్ అన్నారు.
తన పలుకుబడితో మమ్మల్ని టెర్రరిస్టుల్లా చిత్రీకరించాడు
మహబూబ్ నగర్లో మంత్రి చేస్తున్న అక్రమాలను ప్రశ్నిచిన పాపానికి తమను జైల్లో పెట్టించారని మున్నూరు రవి ఆరోపించాడు. ‘శ్రీనివాస్ గౌడ్ తన పలుకుబడితో మమ్మల్ని టెర్రరిస్టుల్లా, నిందితుల ముఠా సభ్యులుగా చిత్రీకరిచాడు. న్యాయపరంగా ఆయన అవినీతిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాను. ఉద్యమ దశ నుంచి తెలంగాణ కోసం పోరాడాను. మేం ఏ తప్పు చేయలేదు. లై డిటెక్టర్ టెస్టుకు మేం సిద్ధం.. శ్రీనివాస్ గౌడ్ నువ్వు సిద్ధమా? అసలు ఫరూక్ ఎవరో మాకు తెలియదు. మాపై కుట్రను తనపై కుట్రగా శ్రీనివాస్ గౌడ్ కథ అల్లారు’ అని మున్నూరు రవి అన్నారు.
For More News..