
చైనాతో వార్కు సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. అది ఎలాంటి వార్ అయినా పర్లేదు ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. అమెరికాను ఉద్దేశిస్తూ చైనా చేసిన వార్ కామెంట్లపై ఆ దేశ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ బుధవారం తీవ్రంగా స్పందించారు. సంఘర్షణను నివారించేందుకు సైనిక బలం ఎంతో కీలకమని.. అందుకే తమ సైన్యాన్ని పునర్ నిర్మిస్తున్నామని ప్రకటించారు.
చైనాతో లేదంటే ఎవరితో అయినా యుద్ధం రాకుండా నిరోధించాలనుకుంటే అమెరికా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. శాంతి అనేది.. బలం నుంచే వస్తుందని, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ అర్థం చేసుకున్నారని తెలిపారు. చైనా రెచ్చగొట్టే కామెంట్లు చేసినప్పటికీ.. జిన్‌పింగ్‌తో ట్రంప్‌కు మంచి సంబంధాలే ఉన్నాయని పీట్ హెగ్సేత్ అన్నారు.
చైనా కూడా తన ఆర్మీని బలోపేతం చేస్తున్నదని గుర్తు చేశారు. ఎక్కడైతే సహకారం అందించాలో.. అక్కడ చైనాకు తమ మద్దతు ఉంటుందన్నారు. ట్రంప్ మాత్రం శాంతి, అవకాశాలనే కోరుకుంటున్నారని చెప్పారు.