యుద్ధమే కావాలంటే మేం సిద్ధం.. అమెరికాకు చైనా వార్నింగ్

యుద్ధమే  కావాలంటే   మేం సిద్ధం.. అమెరికాకు చైనా వార్నింగ్
  • యుద్ధమే  కావాలంటే   మేం సిద్ధం.. అమెరికాకు చైనా వార్నింగ్ 
  • ఏ యుద్ధమైనా చివరి వరకూ ఫైట్ చేస్తమంటూ ట్వీట్

బీజింగ్: అమెరికా యుద్ధమే కావాలని కోరుకుంటే తాము సిద్ధమేనని చైనా తేల్చిచెప్పింది. టారిఫ్ వార్ అయినా, ట్రేడ్​ వార్ అయినా లేక మరే ఇతర యుద్ధమైనా సరే.. చివరి వరకూ ఫైట్ చేయడమే తమకు అలవాటని పేర్కొంది. చైనాపై రెసిప్రోకల్ టారిఫ్స్​కు సంబంధించి బుధవారం అమెరికన్ కాంగ్రెస్​లో ప్రెసిడెంట్ డొనాల్డ్​ ట్రంప్ చేసిన కామెంట్స్ పై అమెరికాలోని చైనా ఎంబసీ తాజాగా స్పందించింది. 

ట్రంప్ కామెంట్స్​ను ఉద్దేశిస్తూ ఎంబసీ అధికారి ఒకరు ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతకుముందు అమెరికా కాంగ్రెస్​లో ట్రంప్ ప్రసంగిస్తూ.. విదేశాలు తమ వస్తువులపై చాలా పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నాయని ఆరోపించారు.  ఆయా దేశాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్ లతో పోలిస్తే మూడు, నాలుగు రెట్లు ఎక్కువని మండిపడ్డారు. చైనాపై అమెరికా వేసే పన్నులతో పోలిస్తే చైనా తమపై వేసే పన్నులు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. కొరియా విషయంలోనైతే ఇది నాలుగురెట్లని వివరించారు. 

ఇది చాలా అన్యాయమని, అమెరికన్లకు నష్టం కలగజేస్తోందని చెప్పారు. ఇకపై ఈ అన్యాయం జరగకుండా అడ్డుకుంటానని ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రిసిప్రొకాల్ టారిఫ్స్ ను విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలు విధించే ట్యాక్స్​కు అనుగుణంగా అమెరికా కూడా అంతేమొత్తంలో టారిఫ్స్ విధిస్తుందని ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చైనాపై ఇప్పటి వరకు విధిస్తున్న 10 శాతం టారిఫ్ ను ప్రస్తుతం 20 శాతంగా మార్చేశారు. చైనా నుంచి అమెరికాలోకి చేరుతున్న ఫెటానిల్ డ్రగ్ ను కంట్రోల్ చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఈ విషయంలో చైనా సీరియస్ గా పనిచేయాలనే ఉద్దేశంతోనే టారిఫ్ లు పెంచినట్లు అధికారవర్గాలు వివరణ ఇచ్చాయి. 

అయితే, పన్నులు పెంచాలని ట్రంప్ ఎప్పుడో నిర్ణయించుకున్నారని, దీనిని సమర్థించుకోవడానికి ఫెటానిల్  డ్రగ్​ను సాకుగా చూపిస్తున్నారని చైనా ఎంబసీ విమర్శించింది. అగ్ర రాజ్యంలో ఫెటానిల్ డ్రగ్ వ్యాప్తికి కారణం అమెరికానేనని ఆరోపించింది. డ్రగ్ వ్యాప్తిని అరికట్టలేక చైనామీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. అమెరికా పౌరులపై సానుభూతితో ఫెటానిల్ డ్రగ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. సాయం చేస్తున్న తమపైనే అమెరికా నిందలు వేయడం విచారకరమని ఆరోపించింది. ఫెటానిల్ డ్రగ్ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఉద్దేశమే కనుక అమెరికాకు ఉంటే సాయం చేయడానికి తాము సిద్ధమని చైనా ఎంబసీ స్పష్టం చేసింది.