- పరకాలలో వంద పడకల ఆస్పత్రి ఏడాదిలో పూర్తి
- సెంట్రల్ జైలు స్థానంలో 1100 కోట్లతో 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో దవాఖానా
- పరకాలలో మంత్రి హరీష్ రావు
హన్మకొండ జిల్లా: వరంగల్ లో హెల్త్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. జైలు కంటే వైద్యం ముఖ్యమని సెంట్రల్ జైలు స్థానంలో 1100 కోట్ల రూపాయలతో 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో దవాఖానా కట్టుకుంటున్నామని ఆయన తెలిపారు. పరకాల పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులతో కలసి హరీష్ రావు పాల్గొన్నారు. పరకాల జూనియర్ కాలేజి గ్రౌండ్ లో ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన బహిరంగ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పరకాలలో వందపడకల ఆసుపత్రిని ఏడాదిలో పూర్తి చేయిస్తామన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించారు. అలాగే రైతులకు ఎరువులు కొరత లేకుండా చేశారని, పది లక్షల 30వేల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయించారని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల శాతం 54 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని మంత్రి హరీష్ రావు కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపాలని బిజెపి నేత కేంద్రానికి లేఖ రాశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 75 ఏళ్ల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చరిత్రలో ఖాళీ కుండలు లేవు అని పేర్కొన్నారు. బీజేపి ఏమిచ్చింది.. గ్లోబల్ ప్రచారం తప్ప అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పథకాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రే ఆశ్చర్యపోయారన్నారు. రైతుబంధు దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. తెలంగాణ పథకాలు చూసి కర్నాటకలోని రాయచూర్ చెందిన బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు అమలు చేయండి లేకుంటే.. రాయచూర్ ను తెలంగాణలో కలుపండని కోరారని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి
హెల్త్ ప్రొఫైల్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు