ఈరోజు భారత్ పర్యటనలో ఉన్న మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాయ్‌కాట్ మాల్దీవ్స్ కారణంగా తమ దేశ పర్యాటక రంగం ఎంత నష్టపోయిందో వివరించారు. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాల్దీవ్స్ ప్రజల తరపున భారత్‌కి క్షమాపణలు కోరుతున్నానని మీడియా సమావేశంలో తెలిపారు. మాల్దీవ్స్ నుంచి భారత్ సైన్యం వెళ్లిపోవాలని ఆదేశిస్తే భారత్ ఆ విషయంలో ఎలాంటి తగువు పెట్టుకోలేదని, చర్చించేందుకే ముందుకు వచ్చిందని ప్రశంసించారు.
ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత మాల్దీవ్స్ మంత్రులు కొందరు నోరు పారేసుకున్నారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి భారతీయులు బాయ్‌కాట్ మాల్దీవ్స్ అంటూ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ తో ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ విషయంపై మహమ్మద్ నషీద్ మాట్లాడుతూ.. బాయ్‌కాట్ మాల్దీవ్స్ కారణంగా మా పర్యాటక రంగంపై గట్టిగానే ప్రభావం పడింది. ఇలాంటి సమయంలో భారత్‌కి రావడం కాస్త ఇబ్బందిగానే అనిపిస్తోంది. ఇలా జరిగి ఉండకూడదు. భారతీయులంతా మాల్దీవ్స్‌కి రావాలని కోరుకుంటున్నాను. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. భారత్ పర్యటనలో భాగంగా నషీద్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు.
ALSO READ :- తగ్గనున్న ఉల్లి, ఆలుగడ్డ సాగు.. పెరగనున్న ధరలు
భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలోనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి మూసా జమీర్‌తో ఇటీవల భేటీ అయ్యారు. ఉగాండా రాజధాని కంపాలాలో ఈ సమావేశం జరిగినట్టు జైశంకర్ వెల్లడించారు. భారత్, మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక బంధంపై చర్చ జరిగినట్టు వివరించారు. రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్‌లో మాల్దీవ్స్‌లో భారతీయ సైనికులను ఉపసంహరించుకోవాల్సిన అంశంపైనా చర్చించినట్టు తెలిపారు.