- నీళ్ల కేటాయింపును కేంద్రం తేల్చలే
- అందుకే రిజర్వాయర్ల పనులు చేయలే
- గెలిచేది మేమే..రెండో స్థానం కోసమే వారి పోటీ
- 'వెలుగు'తో మునుగోడు ఎన్నికల ఇన్చార్జి మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్గొండ, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, ఫ్లోరైడ్ పీడ వదిలిస్తామని టీఆర్ఎస్ఎన్నికల ఇన్ చార్జి, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ‘వీ6 వెలుగు’తో ఆయన మాట్లాడారు. 2014 నుంచి 2018 వరకు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మూడేండ్లలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోకపోవడంతోనే ప్రాజెక్టులు, రోడ్లు పనులు ఆగిపోయాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల కేటాయింపును కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో రిజర్వాయర్ల పనులు చేయలేకపోయామన్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో నీటి కేటాయింపులు సాధించి తీరుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తామని, ఫ్లోరైడ్ పీడను పూర్తిగా వదిలిస్తామన్నారు.
రెండో స్థానం కోసమే వాళ్ల పోటీ
ఉప ఎన్నిక ప్రారంభమైన మొదట్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ అనుకున్నామని, కానీ కాంగ్రెస్ క్యాడర్‌ను మభ్య పెట్టి బీజేపీ లాక్కుందని మంత్రి అన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు సమానంగా ఉన్నాయని, రెండో స్థానం కోసమే వాటి మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఐటీ దాడులు, ఎన్నికల కమిషన్చర్యలు వంటివన్నీ ముందుగానే ఊహించినవేనన్నారు. రాజ్యాంగబద్దమైన సంస్థలన్నింటినీ బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, డబ్బులు ఎర వేసి ఎన్నికల్లో గెలుద్దామని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడన్నారు.
గెలిచిన15 రోజుల్లో రెవెన్యూ డివిజన్
సర్వేలు ఎవరికి వాళ్లే చేయించుకుంటున్నారని జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గత ప్రభుత్వాలు చేయని అనేక స్కీంలు అమలు చేస్తున్నామన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచేందుకు చెక్ డ్యాంలు నిర్మించామన్నారు. మిషన్ కాకతీయ చెరువుల పూడిక తీయించామన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరువేరుస్తామన్నారు. మునుగోడు అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. చండూరు రెవెన్యూ డివిజన్ అనేది కొత్తగా వచ్చిన డిమాండ్ కాబట్టి ఎన్నికల్లో గెలిచిన 15 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు. వంద పడకల దవాఖానాను కూడా మంజూరు చేయిస్తామన్నారు.