
చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించి రోడ్డున పడ్డ పాలమూరు యువకుడు
అనారోగ్యంతో బాధపడుతున్న హుస్నాబాద్ వాసి
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించాలని వేడుకోలు
మహబూబ్‌నగర్/హన్వాడ, వెలుగు : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన పాలమూరు వలస కూలి.. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించడంతో పాటు ప్రస్తుతం పనిలేక రోడ్డున పడ్డాడు. తనను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణను కోరుతూ సెల్ఫీ తీసి గ్రామ యువకులకు పంపించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి గోపాల్ 2021లో దుబాయ్ వెళ్లి ఓ కంపెనీలో కూలీగా చేరాడు.
ఈ టైంలో అదే కంపెనీలో పనిచేస్తున్న, ఇండియాకు చెందిన ఓ వ్యక్తితో గోపాల్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో తన ఐడెంటిటీ మీద సిమ్‌కార్డు తీసుకొని ఆ యువకుడికి ఇచ్చాడు. తర్వాత ఆ యువకుడు అక్కడి బ్యాంక్‌లో లోన్ తీసుకొని ఎగ్గొట్టాడు. 2024లో సెప్టెంబర్‌లో ఇండియాకు వచ్చేందుకు గోపాల్ షార్జా ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతన్ని పట్టుకొని ట్రావెల్ బ్యాన్ కేసు నమోదు చేశారు. 9 వేల దినార్లు ఫైన్ విధించగా.. అంత డబ్బు కట్టలేనని చెప్పడంతో కోర్టులో హాజరుపరచగా మూడు నెలల జైలు శిక్ష విధించారు. ఇటీవల విడుదల అయిన గోపాల్.. తాను పనిచేస్తున్న కంపెనీ వద్దకు వెళ్లి తన పాస్‌పోర్టుపై ఉన్న ట్రావెల్ బ్యాన్ కేసు నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.
ప్రస్తుతం ఉండటానికి గది, తినడానికి తిండి లేకపోవడంతో రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఈ క్రమంలో తన పరిస్థితిపై నాలుగు రోజుల కింద ఓ సెల్ఫీ వీడియో తీసి గ్రామంలోని తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపించాడు. సీఎం రేవంత్‌రెడ్డి, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీకే.అరుణ స్పందించి తాను ఇంటికి చేరుకునేలా సాయం చేయాలని వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం గోపాల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు.
సిద్దిపేట జిల్లాకు చెందిన మరో యువకుడు...
కోహెడ (హుస్నాబాద్), వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య నెల రోజుల కింద దుబాయ్‌కి వెళ్లి భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. 20 రోజుల నుంచి కాళ్ల వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో తనను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించాలని సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను ఇండియాకు రాకుండా తన పాస్‌పోర్ట్‌ను కంపెనీ వారు తీసుకున్నారని వీడియోలో కన్నీరు మున్నీరయ్యాడు. దీంతో తన భర్తను క్షేమంగా హుస్నాబాద్ రప్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవ తీసుకొవాలని లింగయ్య భార్య రజిత కోరారు.