
ప్రపంచంలో రోజురోజుకూ భారీ మార్పులు జరిగిపోతున్నాయి. అభివృద్ధి ఎలా ఉన్నా మనిషి మనుగడకే ప్రమాదం వచ్చే సంకేతాలు కొన్ని చూస్తున్నాం. అందులో మంచి నీరు రోజురోజుకు తగ్గిపోవడం. భూమిపై మంచి నీరు ఉన్నదే కొంచెం. అందులో కొంత సముద్రంలో కలిసిపోతుంటే.. చాలా వరకు మానవ తప్పిదాల వలన కలుషితం అవుతోంది. పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం, పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాల వలన ఇవాళ కొన్ని దేశాలు మంచి నీటికోసం ‘దేహి’ అనే పరిస్థితి ఏర్పడింది. మరి భావితరాలకు మంచినీటిని అందించి ప్రపంచాన్ని సేవ్ చేయాలంటే మనం ఏం చేయాలి..? ‘‘నేను సైతం ప్రపంచ దాహార్తిని తీర్చేందుకు నీటిని వృధా చేయను’’ అనే నినాదంతో సాధ్యమైనంత నీటిని ఆదా చేయడం మన కర్తవ్యం.
సేఫ్(వ్) వాటర్.. మంచి నీటిని ఎలా సేవ్ చేయాలి:
శానిటరీ నాప్కిన్లు, షాంపూ బాటిళ్లు, ప్లాస్టిక్ టూత్ బ్రష్ లు వాడకం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మన దగ్గర వీటిని రీసైక్లింగ్ చేయడం తక్కువ. చెత్త కుప్పలపై లేదంటే నీళ్లపై పడేసి పర్యావరణాన్ని పాడు చేస్తుంటాం. ప్లాస్టిక్ కారకాలు సముద్ర జీవనాన్నిఏ విధంగా చిన్నాభిన్నం చేస్తాయో కళ్లారా చూస్తున్నాం. అందుకే 'ఇకో-ఫ్రెండ్లీ' వ్యక్తిగత ఉత్పత్తులను ఉపయోగించాలి.
స్మార్ట్ షవర్స్ బెస్ట్:
షవర్ బాత్ల ద్వారా నిమిషానికి ఏడు లీటర్ల నీరు పోతుందని మీకు తెలుసా?.. అంటే ఆరేడు నిమిషాలకుగాను ముప్పై నుంచి ముప్పై ఐదు లీటర్ల నీరు వృథా అవుతుందన్నమాట. అందుకే 'బకెట్ బాత్'కి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వృథాను అరికట్టవచ్చు. షవర్ బాత్ తప్పదను కుంటే వాటర్ సేవింగ్ షవర్ హెడ్స్ బిగించడం వల్ల వాటర్ వేస్టేజ్ ను 80 శాతం తగ్గించవచ్చు. నీటిని మనం ఉత్పత్తి చేయలేం అందుకే సంరక్షించుకోవాలి.
లాండ్రీ వాష్ ఇలా చేస్తే నీటిని సేవ్ చేయొచ్చు:
బట్టలు ఉతికేటప్పుడు నీటి వృథా ఎక్కువగా ఉంటుంది. అందుకే బకెట్లలో నీటిని పొదుపుగా వాడి ఉతుక్కోవాలి. వాషింగ్ మెషిన్లను బట్టల లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి. దాని వల్ల నీటిని ఆదా చేయొచ్చు. ఇకో-ఫ్రెండ్లీ, నాన్-టాక్సిక్ డిటర్జెంట్ ను ఉపయోగించినా కొంత నీటిని ఆదా చేసిన వాళ్లం అవుతాం.