ఖైరతాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలకంగా వ్యవహరించిన నందకుమార్‌కు చెందిన రెండు షాప్‌లను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్‌నగర్‌లోని ప్రొడ్యూసర్ దగ్గుపాటి సురేశ్‌బాబుకు చెందిన 1,000 గజాల స్థలాన్ని ఐదేండ్ల క్రితం నంద కుమార్ లీజుకు తీసుకున్నారు. అందులో డెక్కన్ కిచెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దాని ముందు కొత్తగా రెండు షాప్‌ల నిర్మాణాలు చేపట్టారు. వాటికి అనుమతి లేదని ల్యాండ్ ఓనర్స్ కోర్టుకెళ్లారు. దీంతో నిర్మాణాలు ఆపాలని కోర్టు నోటీసులిచ్చినా, అలాగే కంటిన్యూ చేస్తుండటంతో ఆదివారం పోలీసుల సాయంతో అధికారులు ఆ షాప్‌లను నేలమట్టం చేశారు.
రాజకీయ కక్షతోనే షాపులు కూల్చేశారు
షాపుల కూల్చివేతలను నంద కుమార్ భార్య చిత్రలేఖ అడ్డుకున్నారు. ఎందుకు కూల్చివేస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆమె ప్రశ్నించగా, వారు మొహం చాటేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ కక్షతోనే తమ షాపులను కూల్చివేశారని ఆరోపించారు. హోటల్ లీజుకు తీసుకున్నప్పటి నుంచి ఈ షాపులు ఉన్నాయని తెలిపారు. వీటిపై గతంలో తమకు నోటీసు వచ్చిందని, కోర్టుకెళ్లి స్టే కూడా తెచ్చుకున్నామని, అలాంటప్పుడు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. చిత్రలేఖ ఆరోపణలను జీహెచ్ఎంసీ అధికారులు ఖండించారు. ఈ వ్యవహారంపై మూడు సార్లు నోటీసులిచ్చామని, కానీ, వారి నుంచి స్పందన లేదని, అందుకే కూల్చివేశామన్నారు. కాగా, కూల్చివేతలపై ఉన్నతాధికారుల నుంచి తమకు కూడా పక్కా సమాచారం లేదని స్థానిక అధికారులు చెప్పడం గమనార్హం.