గత నెలలో ఆసియన్ దేశాల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక ఎమర్జింగ్ ఆసియా కప్ 2023ను పాకిస్తాన్ యువ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇండియా ఏతో జరిగిన ఫైనల్ పోరులో పాక్ యువ జట్టు ఏకంగా 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 352 పరుగులు చేయగా.. అనంతరం భారత యువ జట్టు 224 పరుగులకే కుప్పకూలింది.
అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. వయసు మళ్లిన ఆటగాళ్లతో బరిలోకి దించటం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 20 ఏళ్ల కుర్రాళ్లతో తలపడటానికి.. 30 ఏళ్లు పైబడిన వారిని ఆడించటంతో ఆ దేశ క్రికెట్ బోర్డుపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విజయంపై స్పందిం చిన ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ హారిస్.. అనుభవం లేని జట్టును టోర్నీకి పంపమని భారత బోర్డును తాము అభ్యర్థించలేదని చెప్పుకొచ్చారు.
"భారత జట్టుతో పోలిస్తే ఎక్కువ మంది సీనియర్లు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నందునే పాక్ జట్టు గెలిచిందని చెప్పడం నన్ను బాధించింది. మా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉండొచ్చు.. కానీ మీరు అటువైపు చూసినా చాలా మంది భారత ఆటగాళ్లు 260 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు."
"ఓటమిని అంగీకరించలేక అనుభవం గురుంచి మాట్లాడుతున్నారు. మా జట్టులో ఎనిమిది మందికి అంతర్జాతీయ అనుభవం ఉందని అంటున్నారు. మేము ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాము? సయ్యుమ్ అయూబ్ 5, నేను 6. ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన వసీం జూనియర్ ఇప్పటివరకూ పాక్ తరఫున 2 టెస్టులు, 14 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. అదేం పెద్ద అనుభవం కాదు. అలా అని చిన్న పిల్లలను టోర్నమెంట్‌కి పంపమని మేము భారత బోర్డుని అడగలేదు. అడిగామా? అది కూడా చెప్పమనండి.." అని పాక్ యువ జట్టు కెప్టెన్ హరీస్ పోడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
Shots fired by Pakistan A Captain Mohammad Haris ?? pic.twitter.com/FtZhUhguG2
— CricTracker (@Cricketracker) August 6, 2023
పాక్ కుర్ర కెప్టెన్ చేసిన ఈ వ్యాఖలపై భారత అభిమానులు విరుచుకు పడుతున్నారు. మీ బుద్ధి మారాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ నెట్టింట ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది అండర్ 14 జట్టును పంపుతామని.. వీలైతే బాబర్ నేతృత్వంలోని పాక్ జట్టును బరిలోకి దించమని సూచిస్తున్నారు.