
- కృష్ణా నీటి వాటాలో ఏటా 50 టీఎంసీలు కోల్పోతున్న రాష్ట్రం
- వరద నీటితో కలిపి ఏడేండ్లలో 400 టీఎంసీలు ఉత్తగ పోయినయ్
- వాటాకు మించి తోడేస్తున్న ఆంధ్రప్రదేశ్
- కృష్ణా నదిపై మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతోనే ఈ దుస్థితి
- ముందుకు పడని పాలమూరు–-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు
హైదరాబాద్, వెలుగు: కోటా మేరకు కృష్ణా నీళ్లను మనం వాడుకోలేకపోతున్నాం. కొట్లాడి సొంత రాష్ట్రం తెచ్చుకొని ఏడేండ్లవుతున్నా ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితుల నుంచి ఇంకా బయట పడలేకపోతున్నాం. ఏటా 50 టీఎంసీల వరకు నీటి వాటాను మన రాష్ట్రం కోల్పోతున్నది. వరద నీళ్లను ఒడిసి పట్టడంలోనూ రాష్ట్ర సర్కారు పూర్తిగా ఫెయిలైంది. వరద మొత్తాన్ని బేసిన్ అవతలి రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ మళ్లించుకుపోతుంటే చోద్యం చూడటం మినహా ఏమీ చేయడం లేదు. ఇట్లా ఏడేండ్లలో వరద జలాలతో కలిపి దాదాపు 400 టీఎంసీల వరకు నీటి వాటాను మనం కోల్పోయాం. కృష్ణా నదిపై కొత్తగా ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల సాగునీటి పరిస్థితుల్లో ఏమాత్రం తేడా రాలేదు. ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చెరువులు నింపడం మినహా స్వరాష్ట్రంలో సాధించింది ఏమీ లేదు.
వాటాకు మించి తోడేస్తున్న ఏపీ
వరుసగా రెండో ఏడాది నాగార్జునసాగర్‌లో 45 టీఎంసీల చొప్పున నీటిని నిల్వ ఉంచి చేతులు దులుపుకున్నది మన సర్కారు. ఆ నీటిని మరుసటి వాటర్ ఇయర్‌కు క్యారీ ఓవర్ చేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ)ను మన రాష్ట్రం అర్థించడం, దానికి ఏపీ కొర్రీలు పెట్టడం పరిపాటిగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత చేసుకున్న తాత్కాలిక ఒప్పందం మేరకు రాష్ట్రానికి 299 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉంది. కృష్ణా బేసిన్‌లోని మొత్తం నీటిలో ఏపీ, తెలంగాణ 66 : 34 నిష్పత్తిలో నీటిని వాడుకోవాలి. ఏటా 70 శాతం అంతకన్నా ఎక్కువ నీటినే ఏపీ తరలించుకుపోతుండగా, తెలంగాణ వినియోగం 30 శాతంలోపే ఉంటోంది. రెండు రాష్ట్రాలైన ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి వినియోగాన్ని కేఆర్‌ఎంబీ పర్యవేక్షిస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు లెక్కలు పరిశీలిస్తే ఏ ఒక్క సంవత్సరం కూడా మన రాష్ట్ర వినియోగం 200 టీఎంసీలు దాటలేదు.
ప్రాజెక్టులు పూర్తి చేయకనే
ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ఎస్‌ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన పాలమూరు –- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను సకాలంలో పూర్తి చేయకపోవడంతోనే కృష్ణా నీటి వినియోగంలో మన రాష్ట్రం వెనుకబడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. ఈ రెండు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే కనీసం 150 టీఎంసీల వరకు నీటిని అదనంగా తీసుకునే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడంతో జూరాల, దానిపై ఏర్పాటు చేసిన లిఫ్టులు, కల్వకుర్తి, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ, ఏఎమ్మార్ - ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టులతోనే నీటిని తీసుకోగలుగుతున్నాం. వరుసగా రెండేండ్లు కృష్ణా బేసిన్‌లో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు ఉప్పొంగాయి. ఆ వరదను కొంతలో కొంత కూడా ఉపయోగించుకోలేకపోయాం.