చెన్నై: తమిళంలో మాట్లాడుతున్నంత మాత్రాన తమను సంకుచిత మనస్తత్వం కలిగిన వారిగా చూడొద్దని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. హిందీతోపాటు ఏ ఇతర భాషలకూ తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర భాషలను జాతీయ అధికారిక భాషలుగా గుర్తించి ముందుకు తీసుకెళ్లడం మనకు ఇంకా సాధ్యం కావడం లేదన్నారు. అదే సమయంలో ఏ భాషనైనా పౌరులపై బలవంతంగా రుద్దొద్దని.. లాంగ్వేజ్ నేర్చుకోవడమనేది వ్యక్తిగత ఇష్టంతో జరగాలన్నారు.
‘హిందీని అమలు చేయాలనుకునే వారు.. ఆ భాష ఆధిపత్యానికి సంకేతమనే విషయాన్ని గుర్తించాలి. వాళ్లు దేశంలో ఒకే మతం, ఒకే భాష ఉండాలనుకుంటున్నారు. అన్ని సంస్థల్లో హిందీ మాట్లాడేవారిని చేర్చడం ద్వారా ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు. అలాగే హిందీయేతర ఉద్యోగులను సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారు. మాతృభాష స్థానంలో బలవంతంగా హిందీ మాట్లాడేలా చేసే ప్రయత్నాలను మేం వ్యతిరేకిస్తున్నాం. అలాంటి వారికి తమిళ భాష, తమిళనాడు ప్రజలు పూర్తిగా వ్యతిరేకం’ అని స్టాలిన్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాలకు తమిళనాడు శకటాలను ఎంపిక చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇది కావాలనే చేసినట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.
కాగా, తమిళనాడు ప్రజలు మాతృభాషకు ఎంత విలువనిస్తారు. మరోవైపు హిందీ, సంస్కృతమన్నా అంతే వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. తమిళనాడు ప్రభుత్వమూ హిందీ అంటేనే ససేమిరా అనేస్తుంటుంది. ఇప్పుడు దాని పైనే మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు హిందీతో మీకు వచ్చే నష్టమేమిటి? అంటూ ప్రశ్నించింది. చాలా మందికి హిందీ రాక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేసింది. తమిళనాడులో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేయాల్సిందిగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్ట్ ప్రధాన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
మరిన్ని వార్తల కోసం: