కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడతామని చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో శనివారం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. 45 రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల స్థానిక పరిస్థితుల వల్ల ఓడిపోయామని, కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదన్నారు. పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్ కు ఇక్కడ ఓటు బ్యాంకు లేదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైందని పేర్కొన్నారు.