
బెజ్జంకి వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టకూడదని గ్రామస్తులు మంగళవారం గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయమై సర్పంచ్‌ను నిలదీశారు. గ్రామస్తులు మాట్లాడుతూ గ్రీన్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ యజమాన్యం సర్వే నెంబర్557/561/559లోని 16 ఎకరాల్లో ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం డీపీవోకు దరఖాస్తు చేసుకుందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది ఆగస్టులో సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామన్నారు.
ఉన్నట్టుండి అదే నెల 29న సర్పంచ్, ఐదుగురు వార్డు సభ్యులతో కలిసి గ్రామ సభ నిర్వహించకుండా ఫ్యాక్టరీ కోసం తీర్మానం చేశారని ఆరోపించారు. సర్పంచ్ ను ప్రశ్నిస్తే దాటవేశాడని వాపోయారు. అప్పటి నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నామన్నారు. మంగళవారం జీపీ ముందు గ్రామసభ నిర్వహించకుండా తీర్మానం ఎట్లా ఇచ్చావని సర్పంచ్‌ను నిలదీశారు. జిల్లా అధికారుల వచ్చేంతవరకు కదిలేదని లేదని భీష్మించుకు కూర్చున్నారు. బుధవారం డీఎల్పీవో వచ్చి మాట్లాడతారని గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు.