మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మాకొద్దు

ప్రిన్సిపాల్‌‌తో వేగలేకపోతున్నామని సౌకర్యాలపై ప్రశ్నిస్తే తమకు భవిష్యత్‌‌ లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మెడికల్ ​కాలేజీ ఫస్ట్​,సెకండ్​ఇయర్​ స్టూడెంట్లు​ వాపోయారు. మంగళవారం ప్రిన్సిపాల్‌‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రిన్సిపాల్​దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  ఏ కాలేజీలో లేనివిధంగా బస్​ఫీజు రూ. 20 ఇవ్వాలని వేధిస్తున్నారని ఆరోపించారు. కాలేజీ ఫీజు రూ. 26 వేలు ఉంటే రూ. 65 వేలు వసూలు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే  బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. సెకండ్​ఇయర్​క్లాసులు ప్రారంభమై మూడు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ఒక్క ప్రాక్టికల్ ఎగ్జామ్‌‌​కూడా జరగలేదన్నారు. టిఫిన్​, భోజనం క్వాలిటీగా ఉండడం లేదని చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  హాస్టల్‌‌లో తమకు వెసులుబాటుగా ఉండే దుస్తులు వేసుకుంటే  అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పలువురు గర్ల్స్‌‌ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంఈ స్థాయిలో సమగ్ర విచారణ చేసి ప్రిన్సిపాల్‌‌ను సస్పెండ్​చేయాలని డిమాండ్​ చేశారు. 

రిపోర్టర్లను అడ్డుకున్న సిబ్బంది

మెడికల్​కాలేజీలో స్టూడెంట్స్​ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న రిపోర్టర్లు న్యూస్​ కవరేజ్​ కోసం వెళ్తే సెక్యూరిటీ సిబ్బంది గేట్​వద్దే అడ్డుకున్నారు. రిపోర్టర్లను కాలేజీలోకి రానివ్వొద్దని తమకు ఆదేశాలున్నాయని వాళ్లు చెప్పారు. దీంతో స్టూడెంట్లు కాలేజీ లోపలి నుంచి గేట్​బయటకు వచ్చి ధర్నా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లోపలికి వెళ్లాలని స్టూడెంట్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  

డీఎంఈ విచారణ  

రెండు రోజులుగా స్టూడెంట్లు ఆందోళన చేస్తుండడంతో డైరెక్టర్‌‌‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌(డీఎంఈ) ఆఫీసర్లు విచారణకు ఆదేశించారు. దీంతో ఖమ్మం మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్​ఆధ్వర్యంలో నలుగురు బృందం మంగళవారం విచారణ చేపట్టారు. టీమ్‌‌ సభ్యులు స్టూడెంట్ల నుంచి వివరాలు సేకరించడంతో పాటు మెస్‌‌ను  పరిశీలించారు. కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌‌ నుంచి వివరణ తీసుకున్నారు. 

విచారణకు కమిటీ ఏర్పాటు

మెడికల్​కాలేజీలో నెలకొన్న సమస్యలు, స్టూడెంట్ల ఆందోళనలపై విచారణ జరిపేందుకు జడ్పీ సీఈవో ఎస్​. ప్రసూనరాణి అధ్యక్షతన చీఫ్​ ప్లానింగ్​ఆఫీసర్​ శ్రీనివాసరావు, హార్టికల్చర్​ ఆఫీసర్​ కె. సూర్యనారాయణ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​డాక్టర్​ప్రియాంక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాలేజీతో పాటు హాస్టల్‌‌లో కనీస సౌకర్యాలు లేకపోవడం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పర్మిషన్‌‌ ఇవ్వకపోవడం, క్రమశిక్షణ పేరుతో రాత్రి సమయాల్లో హాస్టల్​ క్యాంపస్​లోకి వెళ్లి వీడియోలు రికార్డు చేయడం, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించడం లాంటి ఫిర్యాదులపై  ఈ కమిటీ విచారణ చేస్తుందని పేర్కొన్నారు.  ఈ నెల 22న సాయంత్రం 5 గంటల్లో నివేదిక అందజేయాలని ఆమె ఆదేశించారు.