చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి  : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : యాసంగి పంట చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మంత్రి ఖమ్మంలోని తన నివాసంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ధాన్యం కొనుగోలు, భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నరకం వడ్లకు క్వింటాల్ రూ.500 బోనస్ అందించాలన్నారు. రైతులకు త్వరగా చెల్లింపులు చేసేలా చూడాలని చెప్పారు. 

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్స్ కు తరలించాలని సూచించారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ఈనెల లోపు భూభారతి రైతు సదస్సుల ద్వారా నేలకొండపల్లి మండలంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. సాదాబైనామా దరఖాస్తులను 100 శాతం పరిష్కరించాలన్నారు. మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ చేయాలని చెప్పారు. 

 సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, డీఎం సివిల్ సప్లయిస్ శ్రీలత, డీఏఓ పుల్లయ్య, డీసీఓ గంగాధర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.

భూ వివాద రహిత రాష్ట్రమే భూభారతి లక్ష్యం     

నేలకొండపల్లి : భూ వివాద రహిత రాష్ట్రమే భూభారతి లక్ష్యమని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేదవాడికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కడుపు మండుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి చట్టం అమలులో భాగంగా మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఈనెల 17 నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మండలంలోని సుర్దేపల్లి గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో మంత్రి మాట్లాడారు. 

గత ప్రభుత్వం అనాలోచితంగా ధరణి చట్టాన్ని రూపొందించి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వారందరికీ చట్టాన్ని చుట్టంగా చేసి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. మూడున్నరేళ్ల పాటు ధరణి ఉన్నా కనీసం విధివిధానాలు రూపొందించలేదని విమర్శించారు. ఆ నష్టాన్ని , కష్టాన్ని పూడ్చేందుకే భూ భారతి చట్టాన్ని  తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు 23 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 2,300 దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటినీ పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్​ ముజమ్మిల్​ఖాన్​ మాట్లాడుతూ భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయకులు పాల్గొన్నారు 

అక్రిడిటేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం

ఖమ్మం టౌన్ : జర్నలిస్టులు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్యలపై  టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు మంగళవారం సాయంత్రం ఖమ్మం నగరంలోని సర్దార్ పట్టేల్ స్టేడియం హెలిప్యాడ్ వద్ద  మంత్రి పొంగులేటికి వినతిపత్రాన్ని అందజేశారు. అక్రిడిటేషన్ల గడువు పూర్తి అయ్యి పది నెలలు అయినప్పటికీ,ఇంకా కొత్త కార్డులను మంజూరు చేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.