హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకురావాల్సిన కొత్త విధానాలపై చర్చించారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా కొత్త విధానాలు ఉండాలని, అందుకు అనుగుణంగా బెస్ట్ పాలసీలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత సమీక్ష సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెక్స్ టైల్ రంగానికి సంబంధించి చేనేత కార్మికుల కోసం కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు.
ఇండస్ట్రియల్ కారిడార్లకు భూసేకరణపై ఆరా..
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్తగా ఆరు పాలసీలను రూపొందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు తెలిపారు. ఇందులో ఎంఎస్ఎంఈ, ఎక్స్ పోర్ట్, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలు ఉన్నట్టు వివరించారు. కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుంచి వెయ్యి ఎకరాల మేర భూములను గుర్తించాలని ఇప్పటికే ఆదేశించగా.. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందని సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల కోసం సేకరించే స్థలాలు బంజరు భూములు, సాగుకు యోగ్యం కానివై ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, ఆ భూములను పారిశ్రామిక అవసరాలకే వినియోగిస్తున్నారా? లేదా? వినియోగించని భూములు ఏమైనా ఉన్నాయా? అనే దానిపై ఆరా తీశారు. పరిశ్రమలకు సోలార్ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలానగర్‌లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సమగ్ర నివేదికను సీఎంకు అధికారులు అందజేశారు. వరల్డ్‌ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ కంపెనీలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలు, వాటి స్టేటస్‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు.