హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై.. జగన్ సంచలన కామెంట్స్

హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై.. జగన్ సంచలన కామెంట్స్

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేయగా.. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వెలువడ్డాయి. పోస్టల్ బ్యాలెట్‌లో సునామీ సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవ్వగానే వెనుకబడి పోయింది. చివరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అక్కడ బీజేపీ(48 సీట్లు) విజయం సాధించింది. ఈ ఫలితాల నేపథ్యంలో ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. 

ALSO READ | వైసీపీది ఫేక్ బుద్ధి.. అంతా ఫేక్ ప్రచారం.. మంత్రి అనిత

హర్యానా ఎన్నికల ఫలితాలై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. హర్యానా ఎన్నికల ఫలితాలను వైఎస్ జగన్ ఏపీతో పోల్చారు. పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగించడం సమర్థనీయం కాదన్న వైసీపీ అధినేత.. దేశంలో తిరిగి పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని ట్వీట్ చేశారు.

"మరో (హర్యానా) ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు హర్యానా ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు. భారత్ వంటి అతి పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండాలి. మరింత పరిఢవిల్లేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనికి ఏకైక మార్గం.. ఎన్నికల్లో తిరిగి పేపర్ బ్యాలెట్లను వినియోగించడం.."

"అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్నాయి. ఆయా దేశాల తరహాలోనే మనం కూడా బ్యాలెట్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాలి. బ్యాలెట్ ఓటింగ్ అనేది ఓటర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి.." అని వైఎస్ జగన్ ప్రాంతీయ పార్టీలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.