బడ్జెట్ ను పదేండ్లలో మూడింతలు పెంచాం: ప్రధాని మోదీ

బడ్జెట్ ను  పదేండ్లలో మూడింతలు పెంచాం:  ప్రధాని మోదీ
  • సీఐఐ ‘వికసిత్ భారత్’సదస్సులో ప్రధాని మోదీ 
  • వచ్చే ఐదేండ్లలో మూడో అతిపెద్దఆర్థిక వ్యవస్థగా మారుస్తం
  • గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత్ వైపు చూస్తున్నరని వెల్లడి 

న్యూఢిల్లీ :  దేశ బడ్జెట్ ను పదేండ్లలో మూడు రెట్లు పెంచామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే ఐదేండ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్‌ పయనిస్తోందని  చెప్పారు. ప్రపంచ పెట్టుబడిదారులు భారత్​ను పెట్టుబడులకు గమ్యస్థానంగా చూస్తున్నారని అన్నారు. మంగళవారం ఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జర్నీ టువర్డ్స్ వికసిత్​ భారత్' సమావేశంలో ప్రధాని మాట్లాడారు. 

‘ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. ప్రభుత్వ విధానాలు, నిబద్ధత, పెట్టుబడులు ప్రపంచ అభివృద్ధికి పునాదిగా మారుతున్నాయి. ప్రపంచ నాయకులు భారతదేశం పట్ల సానుకూలతతో ఉన్నారు. భారతీయ పరిశ్రమకు ఇది సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని మనం కోల్పోకూడదు’ అని అన్నారు.  భారత్ 8 శాతం వృద్ధిని సాధిస్తోందని, ప్రస్తుతమున్న ఐదో స్థానం నుంచి ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.

 ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం రూ.11 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2014లో రూ.2 లక్షల కోట్ల కంటే ఐదు రెట్లు పెరిగిందని ప్రధాని తెలిపారు. కోట్లాది ఉద్యోగాలను సృష్టించే ఎంఎస్​ఎంఈ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న 1.40  లక్షల స్టార్టప్‌లకు నిలయంగా మారిందన్నారు. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా స్కీంలతో 8 కోట్ల మంది వ్యాపారాలు ప్రారంభించారన్నారు.