- జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశిస్తున్నామని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత, ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూ కాశ్మీర్ కు కేంద్రం ప్రత్యేక హోదాను 2019లో రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘మేం అధికారాన్ని చేపట్టి రెండు నెలలకుపైగా అవుతుంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీకి మేం కట్టుబడి ఉన్నాం. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని మాకు ఇచ్చారు. అందులో ముఖ్యమైనది జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించడం.
జమ్మూకాశ్మీర్ కు కేంద్రపాలిత ప్రాంత హోదా ఇవ్వడం తాత్కాలికం మాత్రమే. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం కూడా మాకు హామీనిచ్చింది. వీలైనంత త్వరగా ఆ హోదా వస్తుందని మేం ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.