
మెదక్, వెలుగు: మహిళా పారిశ్రామిక వేత్తలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి వీ హబ్ ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రోగ్రాంపై అవగాహన పెంపొందించుకోవాలని డీఆర్డీవో శ్రీనివాసరావు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో వీహబ్ ద్వారా జిల్లాలోని ఎస్ హెచ్ జీ మహిళలు, మహిళా పరిశ్రామికవేత్తలకు ర్యాంప్ ( రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ పెర్ఫార్మెన్స్ స్కీమ్) పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వరల్డ్ బ్యాంక్, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎం నిధులతో చేపడుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలకు సపోర్ట్ అందనుందని వీహబ్ డైరెక్టర్ జాహిద్ అక్తర్ షేక్, అసోసియేట్ డైరెక్టర్ ఊహసజ్జ తెలిపారు.
రెండేళ్ల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన మహిళా పరిశ్రామికవేత్తలకు తమ బిజినెస్ అభివృద్ధిని వేగవంతం చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇందులో భాగంగా టెక్స్టైల్స్, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్, హస్తకళలు వంటి రంగాల్లోని వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డైవర్సిఫికేషన్, బ్రాండింగ్, మార్కెట్ యాక్సెస్, క్రెడిట్ లింకేజ్, ఎక్స్పర్ట్ మెంటరింగ్ మద్దతు ఉంటుందన్నారు.