సీఎం టైం ఇస్తే కలుస్తాం

  • 317 జీవోతో స్థానికతను కోల్పోయాం
  • ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ  

బషీర్ బాగ్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తమను కలిసేందుకు సమయం ఇస్తే, తమ గోడును చెప్పుకుంటామని ఉద్యోగ , ఉపాధ్యాయ జేఏసీ లీడర్లు విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 కారణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయారని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా జీవో 317 ను సవరణ చేసేందుకు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ మార్గ్ లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు ఆదివారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ లీడర్​ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కమిటీ 8 నెలలు సమీక్షించి పాత జీవోను కొనసాగించేలా మార్పులు చేసిందన్నారు.

 సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ పట్ల సానుకూలంగా ఉన్నారని, కానీ కొందరు అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. జేఏసీ నాయకులు మధుసూదన్ రెడ్డి, సందీప్, రాజు, నరసింహ, నరేశ్, యాసీన్, సేవియ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, కుమారస్వామి పాల్గొన్నారు.