- మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
- కమాండ్ కంట్రోల్ సెంటర్ వెనుక రోడ్డులో ప్లాంటేషన్
- సిటీలోని ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పిలుపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని, అలాంటి పరిస్థితులు హైదరాబాద్ కు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వన మహోత్సవం–2024లో భాగంగా బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్వెనుక భాగంలోని లింక్ రోడ్డు పక్కన శుక్రవారం ప్లాంటేషన్చేపట్టారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని జీహెచ్ఎంసీ మేయర్విజయలక్ష్మి, బల్దియా ఉన్నతాధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాలుష్యం తారాస్థాయికి చేరి స్కూళ్లు బంద్ చేస్తున్నారని, వలసలు పెరిగే పరిస్థితులు తలెత్తాయని చెప్పారు.
హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ఈవీ పాలసీ తీసుకొచ్చిందని, ఆర్టీసీ బస్సులతో సహా అన్ని రకాల వాహనాలను ఈవీలుగా మారుస్తామన్నారు. 15 ఏండ్లు దాటిన జీహెచ్ఎంసీ వాహనాలను స్క్రాప్ కి ఇచ్చి, ఈవీలు తీసుకొస్తామని తెలిపారు. సామాజిక బాధ్యతగా రోజువారి కార్యక్రమాల్లో మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.