- మామునూర్ ఎయిర్పోర్ట్ భూముల వద్ద రైతులతో సమావేశం
- భూములకు బదులు భూములే కావాలి
- హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి, నాగరాజు
- సమస్యలను ఏకరువు పెట్టిన రైతులు
- డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ
- భూములిచ్చేందుకు రైతుల అంగీకారంపై నేతల హర్షం
వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: ఓరుగల్లు ప్రజల చిరకాల కల మామునూర్ ఎయిర్పోర్ట్ పున:ప్రారంభానికి మరో అడుగు పడింది. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన తమ వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఇక్కడి రైతులు అంగీకరించారు. అదే సమయంలో ఇన్నాళ్లు భూములనే నమ్ముకుని బతుకుతున్న తమకు పరిహారంగా తిరిగి భూములనే ఇప్పించాలని ప్రభుత్వ పెద్దలను కోరారు.
ఇదంతా చర్చించడానికి గురువారం మామునూర్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోని రైతుల వ్యవసాయ భూములే వేదిక అయ్యాయి. ప్రభుత్వం తరపున మంత్రులు, ఎంపీ, మేయర్, ఎమ్మెల్యేలు ప్రశాంతమైన వాతావరణంలో రైతులతో సమావేశమయ్యారు. భూములు, ప్లాట్లు కోల్పోయే బాధిత రైతులు చెప్పుకునే బాధలు, సమస్యలను ప్రజాప్రతినిధులు ఓపిగ్గా విన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, రైతులు ఇచ్చే భూములకు పరిహారంగా వారికి పోలీస్ ఫోర్త్ బెటాలియన్ భూములు ఇచ్చేలా సర్కారు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
రైతులతో మంత్రి, ఎమ్మెల్యేల మీటింగ్
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం మామునూర్ ఎయిర్పోర్ట్ పున:ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ కు150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్ట్ పెట్టొద్దన్నట్లు ఇన్నాళ్లు జీఎంఆర్ సంస్థతో అడ్డంకిగా ఉన్న సమస్యను క్లియర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్లలో మామునూర్ ఎయిర్పోర్ట్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మొదట 950 ఎకరాలు అవసరమని అంచనా ఉండగా 697 ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది. మిగిలిన 243 ఎకరాలు రైతుల వద్ద సేకరించాల్సి ఉంది. ఇందులో గుంటూర్పల్లి, గాడిపల్లిలో 193 ఎకరాలు, నక్కలపల్లి రైతులకు సంబంధించినవి 48 ఎకరాలున్నాయి. ఈ భూములను రైతుల నుంచి సేకరించే ప్రక్రియ ఏండ్ల తరబడి ముందుకుసాగకపోవడంతో.. గురువారం మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్య శారద, అధికారులు నక్కలపల్లి, గుంటూర్పల్లి, గాడిపల్లి పరిధిలోని రైతులతో వారి భూముల వద్దనే టెంట్, కుర్చీలు వేసి మీటింగ్ ఏర్పాటు చేశారు.
డిమాండ్లు చెబుతూనే.. భూములిచ్చేందుకు రైతులు రెడీ
మామునూర్ ఎయిర్పోర్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న చొరవ, ఎయిర్పోర్ట్ వస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రాంత రైతు కుటుంబాలకు, ఉమ్మడి జిల్లా జనాలకు జరిగే ప్రయోజనాలను మంత్రి సురేఖతో పాటు ఎమ్మెల్యేలు రైతులకు అర్థమయ్యేలా వివరించారు. దీంతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు తమ భూములు, స్థలాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. కాగా, తాము కోల్పోతున్న భూములకు బదులుగా ఎదురుగా ఉండే పోలీస్ శాఖ ఫోర్త్ బెటాలియన్ పరిధిలోని తిమ్మాపూర్ రోడ్డులోని భూములు, సెంట్రల్ జైల్ కోసం కేటాయించిన భూములు లేదంటే నాయుడు పెట్రోల్ పంపు దగ్గరలోని రాజవారి కంచెకు చెందిన భూములను పరిహారంగా ఇప్పించాలని కోరారు. భూములకు బదులు డబ్బులు కావాలనుకునే వారికి మార్కెట్ ధర కట్టించాలని కోరారు.
ఎయిర్‌పోర్టుతో పలు గ్రామాలకు ఉన్న ప్రస్తుత రోడ్డు సౌకర్యం కోల్పోయే క్రమంలో ప్రత్యామ్నాయ రోడ్లు, బ్రిడ్జిలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన రైతులకు మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల అభిప్రాయం మేరకు భూమికి పరిహారంగా భూమి ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు చెప్పిన చోట విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఎయిర్పోర్ట్ కు రైతుల త్యాగం చేశారు.. మంత్రి కొండా సురేఖ
మామునూర్ ప్రాంత రైతుల త్యాగం, సహకారంతోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పక్కనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉన్నందున మామునూర్లో పెద్ద ఎయిర్పోర్ట్ వస్తే రైతు కుటుంబాలకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ఓరుగల్లువాసుల గగనయానం కల త్వరలోనే నెరవేరబోతుందన్నారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సిటీలో భద్రకాళి దేవాలయం, వెయ్యి స్తంభాల గుడి, ఖిలా వరంగల్ కోట వంటివి ఉండడంతో టూరిస్టులు పెరుగుతారన్నారు. రైతులకు పరిహారంగా ఇవ్వాల్సిన భూముల వివరాలు, డబ్బుల చెల్లింపు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన నివేదికను వెంటనే పంపాలని వరంగల్ కలెక్టర్ సత్యశారదను ఆదేశించారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవేలు, రైల్వే లైన్ల ఏర్పాటు జరుగుతున్న క్రమంలో మామునూర్లో ఎయిర్పోర్ట్ వస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.