మన దగ్గరా కులాల వారీగా జనాభా తేల్చాలె

మన దగ్గరా కులాల వారీగా జనాభా తేల్చాలె

ఒక బీసీ నేతగా, బీహార్ ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ నితీశ్​కుమార్​కులాల వారీగా జనాభా లెక్కింపునకు శ్రీకారం చుట్టడం సంతోషించాల్సిన విషయం. ప్రతిపక్ష పార్టీల మద్దతుతో శాసనసభలో చర్చించి  కులగణనకు శ్రీకారం చుట్టారు, జనాభాలో అన్ని కులాల లెక్కలు తేలితే సామాజిక న్యాయానికి అవకాశం ఉంటుంది. అందరికీ సమానావకాశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే, ప్రస్తుతం జరుగుతున్న ఏ ఎలక్షన్ లో నైనా ఆయా కులాల శాతాన్ని చూసి పార్టీలు కూడా టికెట్లు ఇస్తున్న  విషయం అందరికి తెలిసిందే. బ్రిటిష్ పాలకులు లెక్కించినటువంటి జనాభా లెక్కల ఆధారంగానే ఇంకా స్వతంత్ర భారతదేశం కొనసాగుతున్నది అంటే ప్రస్తుతం కులగణన అవసరం ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. 

అలాగే అన్నింటికీ కులమే ఆధారం కావాలనే ధోరణి ప్రబలమైతే రాజ్యాంగానికి పునాదిగా ఉన్న విలువలు, ఆదర్శాలు ఏమవుతాయని మేధావులు, ప్రజా సంఘాల ప్రశ్న ఉంది. అలాగే,  ప్రతి కులానికి ఉన్నటువంటి సంఖ్యను బట్టి విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు, అవకాశాలు ఉండాలని డిమాండ్ చేస్తున్న ప్రశ్నకు కూడా లోతుగా సమాధానం అన్వేషించాలి, ప్రతి కులానికి వారసత్వంగా వచ్చే ప్రత్యేక వృత్తి, ఇతర కులాలతో వివాహం నిషేధం, పెద్ద కులం, చిన్న కులం అనే తేడా కొంతమందిని అంటరానివారిగా చూడడం భారత్ లోనే ఉంది. ఏది ఏమైనప్పటికీ  బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా స్వాగతించవలసినది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా అసెంబ్లీలో ప్రతిపక్షాల మద్దతుతో కులగణనకు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. - పేర్వాల నరేష్, కేయూ