
బషీర్ బాగ్, వెలుగు: మ్యాథమెటిక్స్ తో మేథో శక్తి పెరుగుతుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. స్మార్ట్ జీనియస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ విజేతలకు ఆదివారం రవీంద్రభారతిలో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని మాట్లాడారు.
స్టూడెంట్లు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని సూచించారు. మ్యాథమెటిక్స్ తో మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. స్మార్ట్ జీనియస్ సంస్థ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్టారెడ్డి మాట్లాడుతూ.. నేటి సమాజంలో విద్య ఎంతో ముఖ్యమన్నారు. డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా బోధన ఉండాలని టీచర్లకు సూచించారు.
స్మార్ట్ జీనియస్ సంస్థ చైర్మన్ రాజ్యలక్ష్మి రాజ్ మోహన్ మాట్లాడుతూ.. అబాకస్, వేదిక్, మ్యాథమెటిక్స్, హ్యాండ్ రైటింగ్ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 మంది స్టూడెంట్లు పాల్గొన్నారని, 230 మంది చాంపియన్స్‌గా నిలిచారని వెల్లడించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నరసింహారెడ్డి, అడిషనల్ కలెక్టర్ కతి రవన్, సమగ్ర శిక్ష అభియాన్ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ, ఒరాకిల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ రాజ్ మోహన్ పాల్గొన్నారు.