
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్అదుపు తప్పిందని బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆరేండ్ల బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడి, హత్య చేశారని గుర్తుచేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో ఇంటి తగాదాల వల్లే కేబినెట్ విస్తరణ జరగడం లేదని, ఫలితంగా రాష్ర్టానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి లేకుండాపోయారని ఎమ్మెల్యే హరీశ్‌బాబు మండిపడ్డారు. దీని వల్ల అటు విద్యాశాఖపై, ఇటు శాంతిభద్రతలపై రివ్యూలు జరగడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట మర్డర్లు, అత్యాచారాలు జరుగుతున్నాయని..వీటిపై సీఎం రేవంత్ కనీసం రివ్యూ కూడా చేయడం లేదని ఫైర్ అయ్యారు. సీఎం ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో..మంత్రులు వాళ్ల సంపాదనలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదని, కేవలం మార్కుల కేటాయింపులో తప్పులు జరిగినట్లు ఎన్టీఏ చెబుతోందని హరీశ్ తెలిపారు. వీటిని చెక్ చేసి సరిచేస్తామని, అయినా అభ్యర్థులకు నమ్మకం లేకుంటే రీ టెస్టు కండక్ట్ చేస్తామని పేర్కొన్నారు.